గగన్​యాన్ టెస్ట్​ సక్సెస్.. క్రూ ఎస్కేప్ సిస్టం సూపర్

గగన్​యాన్ టెస్ట్​ సక్సెస్.. క్రూ ఎస్కేప్ సిస్టం సూపర్
  • ఇస్రో ‘టీవీ–డీ1’ ప్రయోగం విజయవంతం 
  • రాకెట్ నుంచి మెరుపువేగంతో విడిపోయిన ఎస్కేప్ సిస్టం
  • సురక్షితంగా బంగాళాఖాతంలో ల్యాండింగ్ 
  • మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా ముందడుగు  
  • 5 సెకన్ల ముందు ఆగిన ప్రయోగం..సైంటిస్టుల్లో టెన్షన్ టెన్షన్ 
  • లోపాన్ని గుర్తించి సరిచేసిన సైంటిస్టులు  

శ్రీహరికోట: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ దిశగా ఇస్రో సైంటిస్టులు మరో కీలక ముందడుగు వేశారు. గగన్ యాన్ మిషన్ సందర్భంగా రాకెట్ ప్రయోగంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆస్ట్రోనాట్ లు ఉండే క్రూ మాడ్యూల్ సిస్టం సురక్షితంగా భూమికి దిగిపోయేలా చేపట్టిన ప్రయోగాత్మక పరీక్ష సూపర్ సక్సెస్ అయింది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి చేపట్టిన ‘టెస్ట్ వెహికల్ డెవలప్ మెంట్ ఫ్లైట్ (టీవీ–డీ1)’ పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతం అయిందని ఈ మేరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటించింది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కౌంట్ డౌన్ ముగియగానే శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. వెదర్ కారణంగా రెండు సార్లు వాయిదాపడింది. తొలుత 8.00 గంటలకు, ఆ తర్వాత 8.30కు ప్రయోగానికి సిద్ధం కాగా వెదర్ అనుకూలించలేదు. దీంతో 8.45కు మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి ఇంజన్ లోపం వల్ల 5 సెకన్ల ముందు ప్రయోగం వాయిదా పడింది. దీంతో మిషన్ కంట్రోల్ రూంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రయోగం 10 నిమిషాల్లో సక్సెస్ ఫుల్ గా ముగియడంతో సైంటిస్టులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

5 సెకన్ల ముందు లోపాన్ని గుర్తించి.. 

రెండు సార్లు వాయిదా పడిన తర్వాత మూడోసారి ఉదయం 8.45 గంటలకు 34.9 మీటర్ల పొడవైన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగం ప్రారంభమైంది. అయితే, రాకెట్ నింగికి ఎగరడానికి కేవలం 5 సెకన్ల ముందే ఓ ఇంజన్ స్టార్ట్ కాకపోవడాన్ని గ్రౌండ్ కంప్యూటర్ గుర్తించింది. ఆటోమేటిక్ గా ప్రయోగాన్ని హోల్డ్ చేసింది. వెంటనే ఇంజన్ లోపాన్ని గుర్తించిన ఇస్రో సైంటిస్టులు.. మళ్లీ ఫ్యూయెల్ నింపడం, ఇతర జాగ్రత్తలు తీసుకుని ఉదయం 10 గంటలకు ప్రయోగం స్టార్ట్ చేశారు. ఈసారి అన్నీ సక్రమంగా జరగడంతో రాకెట్ క్రూ ఎస్కేప్ సిస్టం(సీఈఎస్)ను తీసుకుని నింగికి ఎగిరింది.

వెదర్ అనుకూలించక రెండుసార్లు..

మూడోసారి ప్రయోగం స్టార్ట్ కాగానే రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లింది. ధ్వని వేగం (సెకనుకు 343 మీటర్లు) కంటే అధిక స్పీడ్ తో రాకెట్ 70 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. ఆ వెంటనే ఇస్రో సైంటిస్టులు అబార్ట్ కమాండ్ ను పంపారు. దీంతో క్రూ ఎస్కేప్ సిస్టంలోని ఇంజన్లు స్టార్ట్ అయ్యాయి. మెరుపు వేగంతో రాకెట్ నుంచి ఎస్కేప్ సిస్టం విడిపోయి దూరంగా వెళ్లింది. ఆ తర్వాత అది పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో సేఫ్ గా దిగిపోయింది. ఈ మొత్తం ప్రయోగం 10 నిమిషాల్లో విజయవంతంగా ముగిసింది. బంగాళాఖాతంలో దిగిన క్రూ ఎస్కేప్ సిస్టంను నేవీ సిబ్బంది సేకరించారు. దానిని చెన్నై పోర్టుకు తరలిస్తున్నారు. నేవీ సిబ్బంది తీసుకొస్తున్న ఎస్కేప్ సిస్టంను, దానిలోని వ్యవస్థల డేటాను పరిశీలించిన తర్వాత మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు. 

ప్రయోగం ఎందుకంటే..

గగన్ యాన్ మిషన్​లో భాగంగా ఇస్రో 2025లో ఆస్ట్రోనాట్​లను 400 కి.మీ.ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్​లోకి పంపనుంది. ఆస్ట్రోనాట్​లు అంతరిక్షంలో 3 రోజుల పాటు గడిపిన తర్వాత తిరిగి వస్తారు. ఈ మిషన్​లో ఆస్ట్రోనాట్​ల ప్రాణాలకు ముప్పు రాకుండా చూసేందుకు క్రూ ఎస్కేప్ సిస్టం(సీఈఎస్) అత్యంత కీలకం. ఇందులో ఆస్ట్రోనాట్​లు ఉండేందుకు స్పేస్, మాడ్యూల్​ను నడిపేందుకు కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి. భూమిపై ఉన్న ప్రెజర్​తోనే ఇందులోనూ అట్మాస్పియర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ప్రయోగ సమయంలో రాకెట్​కు ప్రమాదం ఏర్పడితే క్రూ మాడ్యూల్ సేఫ్​గా విడిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చిన ఆస్ట్రోనాట్ ల ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాగే క్రూ మాడ్యూల్ నేలపై లేదా సముద్రంలో కూడా సేఫ్ గా దిగిపోవాలి. ఈ రెండు అంశాల్లో సీఈఎస్ పనితీరును పరీక్షించేందుకే ఇస్రో టీవీ–డీ1 ప్రయోగం చేపట్టగా అది విజయవంతం అయింది. గగన్ యాన్ మిషన్ కు ముందు ఇలాంటివే మరికొన్ని ఫ్లైట్ టెస్టులను ఇస్రో నిర్వహించనుంది.

గగన్ యాన్ దిశగా ముందడుగు: మోదీ 

ఇస్రో టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారత్ ఒక అడుగు చేరువైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘గగన్ యాన్ కల సాకారం దిశగా ఇది మరో ముందడుగు. ఇస్రో సైంటిస్టులకు నా బెస్ట్ విషెస్” అంటూ ఆయన శనివారం ట్వీట్ చేశారు. 

ఇస్రో సైంటిస్టులకు కంగ్రాట్స్: ఖర్గే 

గగన్ యాన్ మిషన్ లో భాగంగా శనివారం చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో సైంటిస్టులకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కంగ్రాట్స్ చెప్పారు. ‘‘భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా 2007 నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వెళ్తుండటం చాలా సంతోషకరం. ఇస్రో సైంటిస్టులు, ఇంజనీర్లందరికీ బెస్ట్ విషెస్” అని ఖర్గే ట్వీట్ చేశారు.