పేకాట పాపారాయుడిలో మార్పు: అవయవదానం చేసి.. చచ్చిపోతా!

పేకాట పాపారాయుడిలో మార్పు: అవయవదానం చేసి.. చచ్చిపోతా!
  • సబ్ కలెక్టర్ అనుమతి కోరిన యువకుడు
  • పదేళ్ల వయసు నుంచే పేక ముక్కలు పట్టిన బావాజీ
  • జూదంలో తిరుగులేని ప్రావీణ్యం.. లక్షల్లో సంపాదన
  • జ్ఞానోదయంతో సబ్ కలెక్టర్ ముందుకు..

పట్టుమని పాతికేళ్ల వయసు కూడా లేదు.. పేకాటలో మాత్రం తలపండిన పండితుడు!! పేక ముక్కల్ని వెనుక నుంచి చూసే చదివేస్తాడు. ఆటలోకి దిగాడంటే ఓటమి అంటూ ఎరుగని పేకాట పాపారాయుడు! చదువు లేకపోయినా.. జూదంలోనే లక్షల్లో సంపాదించాడు. ఆ డబ్బుతో చెల్లెలి పెళ్లి కూడా చేశాడు. కానీ, ఇదంతా మోసంతో సంపాదించిన సొమ్ము అనే బాధ పుట్టింది అతడిలో.. అదే ఉన్నట్టుంది వేదాంతిలా మార్చేసింది. ‘‘నేను చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకోవాలి. అవయవాలు దానం చేసి చచ్చిపోతా. నాకు అనుమతి ఇవ్వండి’’ అంటూ సబ్ కలెక్టర్ ఎదుట భావోద్వేగంతో నిలబడ్డాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సబ్ కలెక్టర్ కీర్తి వద్దకు వచ్చిన ఓ యువకుడు తన గోడు చెప్పుకున్నాడు. వేదాంతిలా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కురబలకోటకు చెందిన యువకుడు బావాజీ. అతడి వయసు 24 ఏళ్లు. నిరుపేద కుటుంబంలో పుట్టిన బావాజీ ఆరోతరగతిలోనే చదువు అటకెక్కించేశాడు. పదీ పన్నెండేళ్ల వయసులోనే పేక ముక్కలు చేత పట్టాడు. చదువు ఎక్కకపోయినా.. బుర్ర మాత్రం చాలా షార్ప్. కంటి చూపుతోనే ఏ కార్డు ఏదో వెనుక నుంచే పసిగట్టేసేంత ప్రావీణ్యం సాధించాడు. గాంబ్లింగ్ లోకి దిగితే అవతలి వాళ్లు చిత్తు కావాల్సిందే.

నా వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయ్!

‘‘పేకాటలో లెక్కలేనంత డబ్బు సంపాదించా. ఆ పాపపు సొమ్ముతోనే చెల్లెలి పెళ్లి చేశా. నాకు బాధ, సంతోషం రెండూ ఒక్కటే. దేన్నీ పట్టించుకోకుండా బతికేయడం అలవాటైంది. కానీ, మనసును ఏదో తొలిచేస్తోంది. నా వల్ల పేకాట వల్ల.. కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇక మోసంతో బతకలేను. నాకు ఆ పేకాట సంపాదన వద్దు. అందరూ నన్ను తిట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను సరిగ్గా చదువుకుని ఉంటే పెద్ద సైంటిస్ట్ అయ్యేవాడిని. రోజులో 1000 ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకునేంత పవర్ ఫుల్ మెమొరీ ఉంది నాకు. కానీ ఎవరూ చెప్పేవాళ్లు లేక ఇలా తయారయ్యా. ఇక అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలనుకుంటున్నా. అది నావల్ల కాదు. అందుకే నేను చనిపోతా. అనుమతివ్వండి. నా అవయవాలు నలుగురికీ దానం చేయడం. అలా అయినా నా చావు తర్వాత పది మంది మెచ్చుకుంటారు’’ అంటూ సబ్ కలెక్టర్ కీర్తిని బతిమాలాడు బావాజీ.

సాయం చేస్తాం.. మంచిగా బతుకు

బావాజీ మాటతీరు చూసి.. ఈ వయసుకే ఈ మాటలేంటన్నట్టుగా నవ్వుతూ ఉండిపోయారు సబ్ కలెక్టర్ కీర్తి. మంచి తెలివి తేటలు ఉన్నాయి.. చదువుకోని బాగుపడొచ్చు కదా అని చెప్పారు. ఇప్పుడు  అది సాధ్యం కాదని అతడు అనడంతో మంచిగా బతుకుతానంటే ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తానని చెప్పి పంపించారు.