కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్త

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్త
  • హైదరాబాద్​లో తప్ప ఎక్కడా లేని ప్రాసెస్​ అండ్​ డిస్పోజల్​ వ్యవస్థ
  • నగరాలు, పట్టణాల్లో రోజూ 12 వేల టన్నుల చెత్త ఉత్పత్తి
  • చెత్తను సేకరించుడు.. రోడ్ల పొంట పోసుడు..అంతటా ఇదే పరిస్థితి

రాష్ట్రంలో చెత్త నిర్వహణ అధ్వానంగా తయారైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడపడితే అక్క చెత్త పేరుకుపోతోంది. ఒక్క హైదరాబాద్​ నగరంలో మినహా రాష్ట్రంలోని ఇతర ఏ నగరంలో కానీ, పట్టణంలో గానీ  చెత్తను నిర్వహించే వ్యవస్థ (ప్రాసెస్​ అండ్​ డిస్పోజల్​) లేదు. రోజూ ఇండ్ల నుంచి, ఇతర కమర్షియల్​బిల్డింగ్స్​ నుంచి సేకరించే చెత్తను రోడ్ల వెంట  పారేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో ఒక దిక్కున డంపింగ్​ యార్డుల్లో పోసి కాలబెడుతున్నారు. దీంతో ఎయిర్​ పొల్యూషన్​ పెరిగిపోతోంది. చెత్త నిర్వహణ విషయంలో ఏ కార్పొరేషన్​గానీ, మున్సిపాలిటీగానీ సీరియస్​గా ఆలోచించడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

రోజూ 12 వేల టన్నుల చెత్త

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కలిపి 1.60 కోట్ల మంది నివసిస్తున్నారు. మున్సిపల్​ శాఖ స్టడీ ప్రకారం కార్పొరేషన్లలో రోజూ ఒక వ్యక్తి తరఫున 600 గ్రాములు, మున్సిపాలిటీల్లో అయితే 400 గ్రాముల చెత్త బయటకు వస్తుంటుంది. దీని నిర్వహణ కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  ఏర్పాట్లు ఉండాలి.  ప్రస్తుతం హైదరాబాద్  నగరంలో రోజూ 6 వేల టన్నులు, వరంగల్ నగరంలో 450 టన్నుల మేరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. కరీంనగర్​, ఖమ్మం, నిజామాబాద్​, మహబూబ్​నగర్​, కొత్తగూడెంలో సగటున 200 టన్నులు, ఇతర పట్టణాల్లోనూ సగటున  రోజూ 100 టన్నుల చెత్త రోజూ పోగవుతోంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోజూ 12 వేల టన్నుల చెత్త బయటకు వస్తోంది. ‘‘ఒక్క హైదరాబాద్​లో మాత్రమే ప్రాసెస్​ అండ్​ డిస్పోజల్​ వ్యవస్థ ఉంది. అయితే  హైదరాబాద్​లోనూ ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు లేవు. రాష్ట్రంలోని మిగిలిన ఏ కార్పొరేషన్​, మున్సిపాలిటీల్లోనూ చెత్త నిర్వహణకు ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు’’ అని మున్సిపల్​ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్వచ్ఛ భారత్​ మిషన్​ ప్రమాణాల పరంగా పర్యవేక్షిస్తే రాష్ట్రంలోని పట్టణాల్లో దయనీయ పరిస్థితులే ఉన్నాయని ఆయన వివరించారు.

పెరుగుతున్న చెత్త భారం

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే 50 శాతం మంది పట్టణాల్లోనే జీవిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 70 శాతానికి చేరుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో 42.6 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. పట్టణీకరణ పరంగా మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉంది. మరో ఐదేండ్లలో 50 శాతానికి చేరుకుంటుందని మున్సిపల్​ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌‌ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వరంగల్‌‌, కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఖమ్మం వంటి నగరాలు కూడా వేగంగానే విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ పెరుగుతుండడంతో చెత్త భారం ఇలాగే పెరుగుతోంది. చెత్త నిర్వహణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి కచ్చితమైన విధానం లేకపోవడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చెత్తమయంగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పట్టణాలన్నీ డంపింగ్​యార్డులుగా మారకముందే.. చెత్త నిర్వహణకు మెరుగైన విధానం అమలు చేయాలని జనం కోరుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలోనైనా ఇది పక్కాగా జరగాలని అంటున్నారు.

యాడ జూసినా చెత్తే

నిజామాబాద్ నగరంలో చెత్త వేసేందుకు నాగారం ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉంది. అయితే నగరంలో మాత్రం చెత్త నిర్వహణ సరిగా లేదు. మాలపల్లి, ఫులాంగ్, గాయత్రీనగర్ తదితర ప్రాంతాల్లోని ఇండ్ల పరిసర ప్రాంతాల్లోనే చెత్తను వేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త కోసం అక్కడక్కడా బాక్సులు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల బాక్సులు కూడా పగిలిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో డంపింగ్ యార్డు ఉన్నా రోజు పోగయ్యే చెత్తను వేసేందుకు జాగ పరిపోవడంలేదు. ప్రస్తుతం ఫోన్ నెంబర్ బస్తీలో ఉన్న డంపింగ్​యార్డును అక్కడి నుంచి మార్చాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణ లేదు. వాడల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు.

సూర్యాపేట పట్టణంలో డంపింగ్​యార్డు ప్రత్యేకంగా ఉంది. కోదాడలో తడి, పొడి చెత్తలను వేరు చేసి సేకరిస్తున్నారు. వీటిని డంపింగ్​యార్డుకు తరలిస్తున్నారు. హుజూర్‌‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి​లో డంపింగ్​యార్డులు లేవు. వీటి ఏర్పాటు కోసం స్థల పరిశీలన జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని నందాపురం, నెల్లిబండ తండా రెండు ప్రాంతాలలో డంపింగ్ యార్డుల కోసం స్థలాలను
గుర్తించారు.

సాలిడ్​ వేస్ట్ మేనేజ్​మెంట్​ రూల్స్‌‌‌‌- 2016 ఏం చెబుతున్నాయంటే..

చెత్తను కాలబెట్టడంగానీ, ఓపెన్​ ప్లేస్​లో వేయడం గానీ చేయొద్దు.

పద్ధతి ప్రకారం ప్రాసెసింగ్​ చేయాలి. అన్ని రకాల ప్లాస్టిక్​ బాటిల్స్, రీసైకిల్​ చేసేందుకు వీలైన ఇతర చెత్తను ప్రాసెస్​ చేసి తరలించాలి.

డంపింగ్​ యార్డులు ఉండాలి. వీటిలోనూ చెత్తను పడేయొద్దు. డంపింగ్​ యార్డులలో కింద, పైన కవరింగ్​ చేసిన తర్వాతే చెత్తను వేయాలి. లేకుంటే వర్షాకాలంలో చెత్తతో ఉండే నీరు పక్కలకు లీకవుతుంది. దీని వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది.

డంపింగ్​ యార్డుల్లోనూ చెత్తను కాలబెట్టడానికి వీల్లేదు.

ప్రాసెస్​ అండ్​ డిస్పోజల్​ అంటే..

ప్రాసెస్​ అండ్​ డిస్పోజల్​ వ్యవస్థలో భాగంగా చెత్తను మొదట సైజుల వారీగా వేరు చేస్తారు. ఫుడ్​ వేస్ట్, ప్రూట్​ వేస్ట్​, వెజిటబుల్​వేస్ట్ వంటి ఎరువుగా తయారయ్యే చెత్తను ప్రత్యేకంగా వేరు చేస్తారు. దీన్ని ఎరువుల తయారీ కోసం ఉపయోగిస్తారు. ప్లాస్టిక్​, క్లాత్​, కొబ్బరి, కట్టె వంటి ఇతర చెత్తను వేరు చేసి.. ప్రత్యేక విధానంలో తగలబెట్టడం, కరెంటు ప్రొడక్షన్​లో వాడడం జరుగుతుంది. అయితే ఈ వ్యవస్థ హైదరాబాద్​లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేదు. హైదరాబాద్​లో కూడా ఉత్పత్తయ్యే చెత్తకు తగ్గట్టుగా వ్యవస్థ లేదు.