డంపింగ్ యార్డులుగా రోడ్లు.. పొంగుతున్న డ్రైనేజీలు

డంపింగ్ యార్డులుగా రోడ్లు.. పొంగుతున్న డ్రైనేజీలు

మూసాపేట/ పద్మారావునగర్ , వెలుగు : మూసాపేట​ సర్కిల్​ పరిధిలోని డంపింగ్ యార్డులో పోయాల్సిన చెత్తను అక్కడి రోడ్లపైనే కుప్పలుగా పోస్తున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో దుర్వాసనకు జనాలతోపాటు, అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తలేని నగరంగా హైదరాబాద్​ను తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకునే జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం..  చెత్త నిర్వహణ బాధ్యతను రాంకీ సంస్థకు అప్పగించింది. 

అయితే అధికారుల నిర్లక్ష్యం, రాంకీ సంస్థ నిర్వహణలోపంతో  కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ ​యార్డు చుట్టు పక్కల గుట్టలుగా పోస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు రోడ్లపై మ్యాన్​హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. 

మెయిన్ రోడ్లు, కాలనీలు, బస్తీల్లో శానిటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్– ముషీరాబాద్ మెయిన్ రోడ్డు బోయిగూడ వై జంక్షన్ సమీపంలో 10 రోజులుగా మ్యాన్​హోల్స్​ పొంగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉప్పలమ్మ గుడి సమీపంలోని బస్తీ దవాఖాన వద్ద వారం రోజులుగా మురికి కాల్వ నుంచి నీరు రోడ్డుపై పారుతోంది. ఇక్కడ ఇటీవలే కొత్తగా రోడ్డు వేశారని.. మురుగు పారుతుండటంతో ఫలితం లేకుండా  పోయిందని స్థానికలు చెబుతున్నారు.‌‌‌‌ - ‌‌‌‌ -