కామారెడ్డి డీఎంహెచ్ వో పై ఎంక్వైరీ

కామారెడ్డి డీఎంహెచ్ వో పై ఎంక్వైరీ
  •     డీఎంహెచ్‌వో పై చర్యలు తీసుకోవాలని మహిళా డాక్టర్ల వినతి 
  •     కావాలనే ఆరోపణలు చేస్తున్నారని డీఎంహెచ్‌ వో వివరణ
  •      కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ సిబ్బంది నియామకాల్లో అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

కామారెడ్డి,  వెలుగు : కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్ పై బుధవారం ఎంక్వైరీ జరిగింది.  ఇటీవల కొంతమంది మహిళా డాక్టర్లు తమను డీఎంహెచ్‌వో  వేధిస్తున్నాడని  హెల్త్‌ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులకు కలెక్టర్, ఎస్పీలకు సైతం ఫిర్యాదులు అందజేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.  పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ ఎంక్వైరీ  కోసం బుధవారం డీఎంహెచ్‌వో ఆఫీసుకు వచ్చారు.   ఎంక్వైరీ ఆఫీసర్ మహిళా డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి  వెంకట రమణారెడ్డి కూడా డీఎంహెచ్‌వో ఆఫీసుకు వచ్చారు. ఎంక్వైరీ  కోసం మహిళా అధికారిని కాకుండా పురుష  అధికారిని నియమించడంపై ఎమ్మెల్యే ప్రశ్నించారు.  కమిటీలో మహిళా అధికారి ఉండాలి కదా అని ప్రశ్నించారు.   మహిళా అధికారి లేకుండా మహిళా డాక్టర్లు  తమకు జరిగిన ఇబ్బందులపై ఏ విధంగా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డీఎంహెచ్‌ వో వెకిలి మాటలు... 

డీఎంహెచ్‌వో వెకిలి మాటలు, చులకనగా చూడటం తో పాటు చాంబర్ లోకి వెళితే తమను తాకేందుకు ప్రయత్నిస్తున్నాడని మహిళా డాక్టర్లు ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వివరాలు అడుగుతూ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళా డాక్టర్లు ఎంక్వైరీ ఆఫీసర్, ఎమ్మెల్యే ఎదుట తమను ఇబ్బందులను గురి చేస్తున్నారని చెబుతుండగా..

డీఎంహెచ్ వో అడ్డుపడ్డాడు. తనపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందుగా మహిళా డాక్టర్లను చెప్పుకోనీయాలని మీరు ఏదైనా ఉంటే చెప్పాలని ఎంక్వైరీ ఆఫీసర్ అమర్ దీప్ నాయక్ డీఎంహెచ్ వో కు సూచించారు. 

డీఎంహెచ్‌వో పై కేసు నమోదు

 కామారెడ్డి డీఎంహెచ్ వో పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐదుగురు మహిళా డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీఎంహెచ్ వో పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

అక్రమాలపై కూడా విచారణ చేయాలి

డీఎంహెచ్ వో ఆఫీసు అక్రమాలకు అడ్డాగా మారిందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుటనే డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీను నాయక్ ను పలు అంశాలపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.  

రోస్టర్ పాయింట్లు ఎక్కవగా వేసి అనుభవం లేని వారికి పోస్టింగులు ఇచ్చారని,  వేలాది రూపాయలు ఇచ్చిన వారికి అనుకూలంగా చేసి, అసలైన వారికి అన్యాయం చేశారని చెప్పారు.  పలు రకాలుగా వచ్చే ఫండ్స్ కూడా మిస్ యూజ్ చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  

పలువురిని ఇష్టారాజ్యంగా,  అవసరం లేకున్నా కూడా డీఎంహెచ్‌వో ఆఫీసుకు డిప్యూటేషన్‌ చేశారని తెలిపారు.  ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీను నాయక్ పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని డీఎంహెచ్ ను ప్రశ్నించారు. –  ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి