V6 News

సంపన్న ఆసియన్లలో అదానే టాప్.. సంపదలో ముకేశ్ అంబానీని దాటిన అదానీ గ్రూప్ చైర్మన్‌‌‌‌

సంపన్న ఆసియన్లలో అదానే టాప్.. సంపదలో ముకేశ్ అంబానీని దాటిన అదానీ గ్రూప్ చైర్మన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్  ముకేశ్‌‌‌‌ అంబానీని అధిగమించారు. బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ నికర సంపద 92.6 బిలియన్‌‌‌‌ డాలర్ల (రూ.8.61 లక్షల కోట్ల)కి చేరగా, అంబానీ  90.8 బిలియన్‌‌‌‌ డాలర్ల (రూ.8.44 లక్షల కోట్ల) సంపదతో  రెండో స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌‌‌‌ పోర్టులు, ఎనర్జీ, ఎయిర్‌‌‌‌పోర్టులు, కోల్‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌ వంటి వివిధ రంగాల్లో బిజినెస్ చేస్తోంది. 

గౌతమ్ అదానీ సంపద ముఖ్యంగా గ్రూప్‌‌‌‌కి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల నుంచి ఉంది. అదానీ గ్రూప్ షేర్లు పెరగడంతో ఆయన సంపద ఈ ఏడాది 8.10 బిలియన్ డాలర్లు పెరిగింది. మరోవైపు అంబానీ సంపద 16.9 బిలియన్ డాలర్లు పడిపోయింది.  బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌‌‌ ప్రపంచంలోని 500 మంది ధనవంతుల సంపదను రోజూ ట్రాక్ చేస్తుండగా, ఈ  లిస్టులో  గౌతమ్ అదానీ 19వ స్థానంలో ఉన్నారు.  ముకేశ్ అంబానీ 20 స్థానంలో కొనసాగుతున్నారు.

అంబానీ రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్  ద్వారా ఎనర్జీ, టెలికాం, రిటైల్‌‌‌‌ రంగాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ,  షేర్ల పెరుగుదల తక్కువగా ఉండటంతో ర్యాంకింగ్స్‌‌‌‌లో మార్పు వచ్చింది.  గ్లోబల్‌‌గా చూస్తే  టెస్లా ఎలాన్ మస్క్‌‌‌‌ 656 బిలియన్‌‌‌‌ డాలర్ల (రూ.61 లక్షల కోట్ల)తో అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ లారీ పేజ్‌‌‌‌ 286 బిలియన్‌‌‌‌ డాలర్లతో రెండో స్థానంలో, అమెజాన్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌  జెఫ్ బెజోస్‌‌‌‌ 269 బిలియన్‌‌‌‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

అదానీ, అంబానీ మాత్రమే టాప్‌‌‌‌ 50లో ఉన్న భారతీయులు. 2022లో అమెరికా  షార్ట్‌‌‌‌సెల్లర్‌‌‌‌‌‌‌‌ హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ దెబ్బకు అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్   100 బిలియన్‌‌‌‌ డాలర్లు పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ విస్తరణ, ఎనర్జీ ట్రాన్సిషన్‌‌‌‌ వల్ల అదానీ గ్రూప్‌‌‌‌ షేర్లు మళ్లీ పెరిగాయి.  ఈ గ్రూప్‌‌‌‌ రవాణా, లాజిస్టిక్స్‌‌‌‌, ఎనర్జీ, నేచురల్‌‌‌‌ రిసోర్సెస్‌‌‌‌, ఎయిర్‌‌‌‌పోర్టులు, డిఫెన్స్‌‌‌‌, డేటా సెంటర్లు, సిమెంట్‌‌‌‌, మీడియా, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, డిజిటల్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌  వంటి  అనేక రంగాల్లో వ్యాపారం చేస్తోంది.