
ప్రముఖ బిలియనీర్, టెక్స్‌టైల్ దిగ్గజం రేమాండ్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం (నవంబర్ 13న) స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా చెప్పారు. మూడు దశాబ్దాల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నట్లు చెప్పారు.
గతంలో మాదిరిగా ఈ దీపావళి ఉండబోదని, 32 ఏళ్లుగా జంటగా కలిసి ప్రయాణం చేసిన తాము ఒకరికొకరం అండగా నిలబడ్డామన్నారు గౌతమ్ సింఘానియా. నిబద్ధత, సంకల్పం, విశ్వాసంతో ప్రయాణం చేశామని, తమ జీవితాల్లోకి మరో ఇద్దర్ని (పిల్లలను) ఆహ్వానించి తల్లిదండ్రులుగా మారామన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల తర్వాత ఇక నుంచి నవాజ్ మోదీ, తాను భిన్నమైన దారుల్లో ప్రయాణించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆమె నుంచి తాను విడిపోతున్నట్లు... తల్లిదండ్రులుగా మాత్రం తమ కుమార్తెలు నిహారిక, నీసాకు ఉత్తమ జీవితాన్ని అందించే బాధ్యతలను కొనసాగిస్తామన్నారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి.. తమ గోప్యతను కాపాడాలంటూ గౌతమ్ సింఘానియా పోస్ట్ చేశారు.
ALSO READ :- టీడీపీ, జనసేన ఎన్నికల మిని మేనిఫెస్టో రిలీజ్.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం. .
58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో నవాజ్ మోదీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నవాజ్ మోదీ ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం గౌతమ్ సింఘానియా తన తండ్రి విజయ్‌పత్‌తో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
— Gautam Singhania (@SinghaniaGautam) November 13, 2023