V6 News

కంపెనీలో 50% వాటా ఇస్తే 'ఎక్స్‌ట్రా' వర్క్ చేస్తా.. బాస్‌కు చుక్కలు చూపించిన జెన్ జెడ్ ఉద్యోగి

కంపెనీలో 50% వాటా ఇస్తే 'ఎక్స్‌ట్రా' వర్క్ చేస్తా.. బాస్‌కు చుక్కలు చూపించిన జెన్ జెడ్ ఉద్యోగి

ఉద్యోగం దొరకటమే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో. అయితే జెన్ జెడ్ కుర్రకారు మాత్రం పాత కాలం ఉద్యోగుల్లా జీ హుజూర్ అంటూ పని చేయలేం అనేస్తున్నారు. సెలవులు సరిపోకపోయినా, లంచ్ బ్రేక్ తక్కువ ఉన్నా.. తమ పనివేళల కంటే ఎక్కువ సేపు వర్క్ చేయమన్నా అవన్నీ మనదగ్గర కాదంటూ మెుహమాటం లేకుండా చెప్పేస్తున్నారు బాస్‌లకు. మరీ ఎక్కువగా మాట్లాడితే వెనకా ముందూ కూడా ఆలోచించకుండా రిజైన్ చేసేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు జెన్ జెడ్ యువత బిహేవియర్ చూసి ఇలా అయితే కష్టమే అంటున్నాయి. తాజాగా ఒక గురుగ్రామ్ స్టార్టప్ కంపెనీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

కంపెనీ కోసం రాత్రింబవళ్లు కష్టపడాలి.. సొంత కంపెనీలా భావించాలి అని బాస్‌లు కోరుకుంటుంటారు. అయితే గురుగ్రామ్‌కు చెందిన ఒక స్టార్టప్‌లో జెన్ జెడ్ ఉద్యోగి తన బాస్‌కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సాయంత్రం 7 గంటలకే లాగ్-ఆఫ్ అయ్యాడన్న కారణంతో మరుసటి రోజు ఉదయం బాస్ అతనికి 'ఓనర్ మైండ్‌సెట్' గురించి 20 నిమిషాల పాటు క్లాస్ పీకారు. కంపెనీని నీ సొంత బిడ్డలా చూసుకో అంటూ లెక్చర్ ఇచ్చాడు. దానికి ఆ యువకుడు ఏమాత్రం తడబడకుండా.. "సార్, మీరు నాకు కంపెనీలో 50 శాతం వాటా ఇచ్చిన రోజున దీన్ని నా బిడ్డలా చూసుకుంటాను.. ప్రస్తుతానికి నేను కేవలం బేబీ సిట్టర్‌ని మాత్రమే.. నా షిఫ్ట్ 7 గంటలకే అయిపోతుంది" అంటూ ముక్కుసూటిగా బదులిచ్చాడు. ఇది కేవలం ఒక ఆఫీస్ గొడవ కాదు.. మారుతున్న పని సంస్కృతికి, ముఖ్యంగా జెన్ జెడ్ ఆలోచనా ధోరణికి నిదర్శనం.

ఈ ఘటన పాత కాలపు ఉద్యోగులకు, ఇప్పటి జెన్ జెడ్ తరం వారికి మధ్య ఉన్న ఆలోచనా స్పష్టంగా చూపిస్తోంది. పాతతరం వారు ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా.. యజమాని పట్ల విధేయతగా భావించేవారు. ప్రమోషన్ల కోసం, గుర్తింపు కోసం పని గంటలతో సంబంధం లేకుండా ఆఫీసులోనే గడిపేవారు. కంపెనీ కోసం త్యాగాలు చేయడం గొప్ప విషయం అనుకునేవారు. కానీ జెన్ జెడ్ యువత దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నారు. కొత్త తరం యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం బిగులు అంటున్నారు. వీరు పనిని కేవలం ఉపాధిగా మాత్రమే చూస్తున్నారు. కంపెనీ ఇచ్చేది 35 వేల జీతం.. కోరుకునేది మాత్రం సీఈఓ స్థాయి అంకితభావం.. ఇది అన్యాయం అనేది జెన్ జెడ్ వాదన.

నిషాంత్ జోషి తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తన కజిల్ చేసిన పని గురించి పంచుకున్నారు. స్టార్టప్ ఫౌండర్లు లాభాలన్నీ తామే ఉంచుకుంటూ.. ఉద్యోగులు మాత్రం ఫౌండర్లలాగా ఆందోళన చెందాలని, నిద్రలేని రాత్రులు గడపాలని కోరుకోవడం సరైనది కాదంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. పెట్టుబడి పెట్టిన వారికి, లాభాల్లో వాటా ఉన్న వారికి ఉండే తపన.. కేవలం జీతం కోసం పని చేసే ఉద్యోగికి ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని అన్నాడు. జెన్ జెడ్ యువత ఇప్పుడు ఇదే విషయాన్ని సూటిగా అడుగుతోంది. నిజంగా నేను ఓనర్‌లా ఫీల్ అవ్వాలంటే.. నాకు ఆర్థికంగా కూడా ఆ స్థాయిలో వాటా ఉండాలి కదా అన్నది వారి ప్రశ్న.

ఈ మార్పును కంపెనీలు గమనించాల్సిన సమయం వచ్చిందని కొందరు నెటిజర్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మోటివేషనల్ స్పీచ్‌లతో, పిజ్జా పార్టీలతో ఉద్యోగుల నుంచి అంకితభావాన్ని ఆశించడం కష్టమని ఈ ఘటన నిరూపించింది. ఉద్యోగులకు సరైన గుర్తింపు.. కష్టానికి తగ్గ ప్రతిఫలం లేనప్పుడు వారు తమ  పని గంటలు ముగియగానే లాగ్-ఆఫ్ అవ్వడంలో తప్పులేదని మెజారిటీ నెటిజన్లు సపోర్ట్ తెలుపుతున్నారు. 

పాత తరం ఉద్యోగులు ఆఫీస్‌లో బాస్ ఏం చెప్పినా ఎదురు మాట్లాడకుండా చేసేవారు. ప్రమోషన్ వస్తుందనో.. ఇంక్రిమెంట్ ఇస్తారనో గంటల తరబడి ఫ్యామిలీ లైఫ్ పక్కన పెట్టి మరీ ఎక్స్‌ట్రా వర్క్ చేసేవారు. కానీ జెన్ జెడ్ అలా కాదు. జెన్ జెడ్ తమ యజమానులను అడుగుతున్న ప్రశ్నలు భవిష్యత్తులో వర్క్ కల్చర్‌ను మరింత పారదర్శకంగా మార్చే అవకాశం ఉంది.