రావత్ చితాభస్మాన్ని గంగా నదిలో కలిపిన కుమార్తెలు

రావత్ చితాభస్మాన్ని గంగా నదిలో కలిపిన కుమార్తెలు

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌ల చితాభస్మాన్ని  గంగా నదిలో కలిపారు వారి కుమార్తెలు కృతిక, తరుణి. తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయి సీడీఎస్ సహా 13 మంది మరణించారు. నిన్న ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ శ్మశాన వాటికలో సీడీఎస్ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. బిపిన్, మధులిక చితికి వారి కుమార్తెలు నిప్పంటించి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ రోజు ఉదయం మళ్లీ ఆ శ్మశానానికి వెళ్లి వారి చితాభస్మాన్ని సేకరించి.. రావత్ స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. అక్కడి హరిద్వార్‌‌లోని గంగా నదిలో చితాభస్మాన్ని కలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌‌ ధామి కూడా పాల్గొన్నారు.

జీవితాన్ని దేశానికి అంకితం చేసిన యోధుడు

తన జీవితం మొత్తాన్ని దేశం కోసం అంకితం చేసిన యోధుడు సీడీఎస్ బిపిన్ రావత్ అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. రావత్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన ఎప్పుడూ ఉత్తరాఖండ్ అభివృద్ధి గురించి ఆలోచిస్తుండేవారని చెప్పారు. బిపిన్‌ను తాము ఎప్పటికీ మర్చిపోలేమని, ఆయన విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.