IPL 2024: ఎవరీ పార్త్ జిందాల్? ఢిల్లీ ఓనర్‌ని భయపెట్టిన శాంసన్ అభిమానులు!

IPL 2024: ఎవరీ పార్త్ జిందాల్? ఢిల్లీ ఓనర్‌ని భయపెట్టిన శాంసన్ అభిమానులు!

ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగ‌ళ‌వారం(మే 07) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఓట‌మి పాలైన విషయం తెలిసిందే. కీల‌క‌ మ్యాచ్‌లో రాయ‌ల్స్ 20 ప‌రుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ఔటైన తీరు వివాదాస్పదం అయ్యింది. 

రాయల్స్ విజయానికి చివరి 27 బంతుల్లో 60 పరుగులు అవసరమైన సమయంలో శాంస‌న్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఢిల్లీ పేసర్ ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో లాంగ్-ఆఫ్ దిశగా భారీ షాట్ కు యత్నించి షాయ్ హోప్ చేతికి చిక్కాడు. అయితే ఆ క్యాచ్ అందుకునే  స‌మ‌యంలో.. ఫీల్డ‌ర్ హోప్ కాళ్లు బౌండ‌రీ లైన్‌కు తగిలాయన్నది వివాదానికి అసలు కారణం. థర్డ్ అంపైర్ మాత్రం శాంస‌న్‌ను ఔట్‌గా డిక్లేర్ చేశాడు. దీంతో సంజూ ఆన్‌ఫీల్డ్ అంపైర్ల‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఢిల్లీ సహా యజమాని పార్త్ జిందాల్.. పదే పదే 'ఔట్.. ఔట్' అని అరుస్తూ కనిపించాడు. ఆ దృశ్యాలను కెమెరామెన్ బంధించగా, సోషల్ మీడియాలో తక్షణమే వైరల్ అవుతుంది. నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎవరీ పార్త్ జిందాల్?

పార్త్ జిందాల్ ఒక వ్యాపారవేత్త. జిందాల్ సౌత్ వెస్ట్ (JSW) గ్రూప్ వారసుడు. 33 ఏళ్ల పార్త్ 2014లో JSW సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. JSW ఎనర్జీ, కంపెనీ USA కార్యకలాపాలకూ అధిపతిగా ఉన్నారు. పార్త్ జిందాల్.. కర్ణాటకలోని విజయనగరంలో ఉన్న ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ (IIS) వ్యవస్థాపకుడు కూడా. ఈ సంస్థ భారతీయ అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణను అందిస్తోంది. దేశంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు గల సంస్థ అది. తమ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా పేద అథ్లెట్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

పార్త్ జిందాల్ నేతృత్వంలోని JSW స్పోర్ట్స్.. GMR గ్రూప్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతం వాటాను (రూ.550 కోట్లు) కొనుగోలు చేయడం ద్వారా ఐపీఎల్ లోకి ప్రవేశించింది. JSW వారసుడు.. 2018లో ఢిల్లీ ఫ్రాంచైజీకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

No కామెంట్లు

మ్యాచ్ అనంతరం పార్త్ జిందాల్.. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, ఆ జట్టు యజమాని మనోజ్ బదాలేతో మాట్లాడారు. టీ20 ప్రపంచ కప్‌కు ఎంపికైనందుకు శాంసన్‌కు అభినందనలు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ తమ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, శాంసన్ అభిమానులకు భయపడి.. కామెంట్లు చేసే వీలు లేకుండా ఢిల్లీ యాజమాన్యం జాగ్రత్త పడటం గమనార్హం.