ఇండియా కూటమికే బీసీల మద్దతు : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఇండియా కూటమికే బీసీల మద్దతు : జాజుల శ్రీనివాస్ గౌడ్

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పోటీలో ఉన్నాయని  ఏ కూటమి అధికారంలోకి వస్తే 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు , ఆకాంక్షలు నెరవేరుతాయో ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు. 

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లకిడికపూల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రాహుల్ గాంధీతో నిర్వహించిన భేటీలో బీసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆయన హామీని ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం బీసీ కుల గణన , రిజర్వేషన్ల పెంపుపై చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని తెలిపారు.

 ఎన్డీయే హయాంలో బీసీలకు ఒరగబెట్టింది ఏమి లేదని  0 ఏళ్లుగా ఓబీసీ అయిన ప్రధాని మోదీ బీసీ వ్యతిరేకిగా మారారని ఆరోపించారు. మొదట కుల గణన చేస్తామని మాట ఇచ్చి, తరువాత చెయ్యమని బీసీలను బీజేపీ మోసం చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీసీలు బీజేపీను గద్దె దించాలని సూచించారు. బీజేపీ పుట్టింది ఆర్ఎస్ఎస్ పునాధులపైనే... అందుకే ముస్లిం ల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించిందని విమర్శించారు. బీసీల హక్కుల కోసం పాటుపడుతున్న ఇండియా కూటమికి బీసీలందరు అండగా నిలవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.