- మీటింగులకు రావాలె.. ఓట్లు వేయించాలె
- లేదంటే దళితబంధు, గృహలక్ష్మీ రాదంటూ బెదిరింపులు
- ఈ రెండు పథకాలు తమ చేతుల్లోనే ఉన్నాయని ప్రకటనలు
- పేరుకే ఆన్ లైన్ లో అప్లికేషన్లు.. ఎమ్మెల్యేలు చెప్పినోళ్ల పేర్లే ఫైనల్
హైదరాబాద్, వెలుగు: సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకం అందాలంటే పేదలై ఉండాలి. ఆ స్కీమ్ కు పెట్టిన గైడ్లైన్స్మేరకు అర్హులై ఉండాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేకు నచ్చాలి. పార్టీ మనిషి అయి ఉండాలి. ఎట్ల చెబితే అట్ల నడుచుకోవాలి. అట్లయితేనే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. దళితబంధు రెండో విడత, గృహలక్ష్మీ పథకాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం గైడ్ లైన్స్ఇచ్చింది. ఈ రెండు స్కీములను జులై మొదటి వారంలో మొదలుపెట్టనున్నారు. ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకుంటామని, కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేస్తారని జీవోల్లో పేర్కొన్నారు. అయితే తమ నిర్ణయమే ఫైనల్ అని, తాము చెప్పినోళ్ల పేర్లే లిస్టులో ఉంటాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే పథకాలు అందవని కార్యకర్తలు, పబ్లిక్ ను బెదిరిస్తున్నారు. ‘‘స్కీములు కావాలా.. అయితే ఎన్నికలు అయ్యేదాకా నా వెంటే ఉండాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. మీటింగ్లు పెట్టాలి.. మీ వాళ్లతో ఓట్లు వేయించాలి” అని షరతులు పెడుతున్నారు. లేదంటే గృహలక్ష్మీ, దళితబంధు పథకాలు అందవని బెదిరిస్తున్నారు.
హైకోర్టు చెప్పినా...
దళితబంధు అమలు తీరుపై హైకోర్టు గతంలో కీలక కామెంట్లు చేసింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం తగదని చెప్పింది. ఎమ్మెల్యే సిఫార్సులకు, లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి సంబంధం లేదని... ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని చెప్పి దళితబంధు అప్లికేషన్లను వరంగల్ జిల్లా కలెక్టర్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. అర్హత మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉండాలని సూచించింది. దీంతో ప్రభుత్వం కలెక్టర్లు ఆన్లైన్లోఅప్లికేషన్లు తీసుకుంటారని, అయితే ఆ ఆప్లికేషన్లపై ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా అప్లికేషన్లు తీసుకుంటారని పేర్కొంది. ఆన్లైన్ పేరుతో అందరి అప్లికేషన్లు తీసుకుంటున్నట్టు సర్కార్ పైకి చెబుతున్నప్పటికీ.. గతంలో మాదిరే ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టునే ఫైనల్ చేస్తున్నారు. దళితబంధు స్కీమ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారు. అయినా లబ్ధిదారుల ఎంపిక మళ్లీ ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు.
ఎన్నికల లోపు ఇస్తామంటూ ప్రకటనలు..
దళితబంధు, గృహలక్ష్మీ పథకాలకు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకున్నా, తాము చెప్పినోళ్లకే అవి అందుతాయని కార్యకర్తలు, పబ్లిక్మీటింగ్స్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది పేర్లను దళితబంధు కోసం ఎమ్మెల్యేలు రాసుకున్నారు. ఇప్పుడు గృహలక్ష్మీ సాయం కోసం కూడా పేర్లు రాసుకుంటున్నారు. ఎవరు వచ్చినా ముందు పేరు రాసుకుని ‘‘దళితబంధు కింద రూ.10 లక్షలు ఇప్పిస్తా. అయితే ఎన్నికలు అయ్యే వరకు నాతోనే ఉండాలె. మీ ఊర్లో 50 మందిని జమ చేయాలె. ఎక్కడ మీటింగ్ పెట్టినా రావాలి. పోలింగ్ అప్పుడు ఓట్లు కూడా ఏపియ్యాలె’’ అని షరతులు పెడుతున్నారు. సరే అంటే ఎలక్షన్ల లోపు దళితబంధు ఇప్పిస్తానని, లేదంటే ఎప్పటికీ రాదని.. తమ దగ్గరికి వస్తున్న జనాన్ని బెదిరిస్తున్నారు. గృహలక్ష్మీ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు.
అసలు ఎంతమందికి ఇస్తరు?
నిజానికి ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన విధంగా నియోజకవర్గానికి 1,500 మందికి దళితబంధు ఇవ్వాలి. ఇందుకోసం వరుసగా రెండేండ్లలో దాదాపు రూ.35 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. కానీ పోయినేడాది స్కీమ్ అమలు చేయలేదు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో అమలు చేసేందుకు ముందుకు వచ్చినా.. లబ్ధిదారుల సంఖ్యను 1,100కు తగ్గించారు. ఇప్పుడు ఆ 1,100 మందికైనా ఇస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. ఆర్థిక శాఖ నుంచి వచ్చేది రూ.5 వేల కోట్లేనని మొదట చెప్పిన ఉన్నతాధికారులు.. అంతకూడా కష్టమేనని రూ.3 వేల కోట్ల లోపే రావొచ్చని ఇప్పుడు అంటున్నారు. ఈ లెక్కన నియోజకవర్గానికి 500 మందికే దళితబంధు అందే అవకాశం ఉంది. ఇక గృహలక్ష్మీ నియోజకవర్గానికి 3 వేల మందికి ఇస్తామని ప్రకటించారు. ఇది అమలు చేయాలంటే రూ.12 వేల కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల లోపే నిధులు ఇవ్వొచ్చని తెలుస్తున్నది. ఎలక్షన్ల వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటూ.. ‘ఇస్తం ఇస్తం’ అనిఊదరగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ చేసినట్లు సమాచారం.
స్కీమ్ ఏదైనా ఎమ్మెల్యే ఓకే అంటేనే..
నిజానికి రాష్ట్ర సర్కార్ ఏదైనా స్కీమ్ తెస్తే.. ఎమ్మార్వో ఆఫీసులో గానీ, ఎంపీడీవో ఆఫీసులో గానీ, కలెక్టర్ ఆఫీస్‌లో గానీ దరఖాస్తు పెట్టుకోవాలి. అప్లికేషన్లను పరిశీలించి, అర్హత ఉంటే సంబంధిత స్కీమ్ వర్తింపజేస్తారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం స్కీమ్ ఏదైనా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా పథకాల కోసం అర్హులంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట టీఆర్ఎస్ ఇన్చార్జుల చుట్టూ, జిల్లా ఇన్చార్జ్మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఇప్పటికే కల్యాణలక్ష్మీ, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆగ్రోస్ సెంటర్లు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్‌లు, బీసీలకు ఆర్థిక సాయం, ఇంకా ఇతరత్రా స్కీములు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు పొందాలన్నా, రేషన్ షాపులు ఏర్పాటు చేయాలన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి అయింది.
