ఘజియాబాద్ (యూపీ): రూ.2 వేలు మించిన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న కేంద్రం నిర్ణయంపై ఘజియాబాద్‌లోని వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని పలు దుకాణాల వెలుపల ‘యూపీఐ చెల్లింపులు అంగీకరించబోం’ అని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత 0.4% ఛార్జీపై వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎండీఆర్ భారాన్ని వ్యాపారులే భరించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ అదనపు భారం చివరికి తమపైనే పడుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు చేసేటప్పుడు తగినంత నగదును వెంట తెచ్చుకోవాలని వినియోగదారులకు వ్యాపారులు సూచిస్తున్నారు.
రుసుమును వ్యాపారులు మాత్రమే చెల్లించాలి
రూ.2 వేలు దాటిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ రుసుమును వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, రూ.2 వేల లోపు రోజువారీ చెల్లింపులు ఎప్పట్లాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపైకి నెట్టకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అగ్రిగేటర్లతో చర్చిస్తోంది.
