ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా జీఎంఆర్ (GMR-Rajiv Gandhi International Airport హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మార్చి 2023 నెలలో 90.43 శాతం ఆన్-టైమ్ పనితీరును నమోదు చేసినట్టుగా స్పష్టం చేసింది.
ప్రపంచంలోనే 90 శాతం మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. మార్చి నెలలో 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించిన సిరియమ్.. హైదరాబాద్ విమానాశ్రయం 'గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్', 'లార్జ్ ఎయిర్‌పోర్ట్స్' కేటగిరీలలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విమానాశ్రయం నవంబర్ 2022లో 88.44 శాతం OTP(on time performance)తో 'పెద్ద విమానాశ్రయాల' కేటగిరీలో 4వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దీన్ని ఆక్చ్యువల్ గేట్ డిపార్చర్ సర్వీస్ ఆధారంగా ఎంపిక చేశారు. అంటే ఇక్కడ్నుంచి బయలుదేరే విమానాలు దాదాపు 80 శాతం వరకు కరెక్ట్ సమయానికి బయలుదేరే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు తేలింది.
కొన్ని సంవత్సరాలుగా, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్తమమైన సేవలందిస్తున్నామని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ CEO-GMR ప్రదీప్ పనికర్ వెల్లడించారు. విమానాశ్రయ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించామని చెప్పారు.
GMR విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని విమానాశ్రయ రంగానికి చెందిన అనేక మొదటి-రకం(first-of-its-kind) టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇందులో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC)ఉన్నాయి.

