ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల లిఫ్టింగ్ 

ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల లిఫ్టింగ్ 
  • నంది మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్​కు..అక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలింపు 

కరీంనగర్, వెలుగు: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 56 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. సాయంత్రం 6 గంటలకు 75,328 ఇన్​ఫ్లో కొనసాగుతోంది. మరోవైపు కడెం ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఓపెన్​ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కడెం గేట్లు ఓపెన్​ చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. దీంతో ధర్మారం మండలం నందిమేడారం పంప్ హౌస్​కు 4 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు.

ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 12,600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. నంది మేడారం రిజర్వాయర్‌‌‌‌లోని క్రష్ గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే జంట సొరంగాల నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌‌కు తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్‌‌లోని 4 బాహుబలి మోటార్లను ఆన్ చేసి గ్రావిటీ కెనాల్లోకి 12,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్ మానేరులోకి నీరు చేరనుంది. నీటి తరలింపు 4 రోజులపాటు కొనసాగుతుందని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.