దేశంలో బంగారం, వెండికి ప్రజలతో ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. ఎన్ని డబ్బులు ఉన్నా బంగారం, వెండి ఆభరణాలనే సంపదగా ఫీలవుతుంటారు భారతీయులు. అలాంటిది ఇప్పుడు దేశంలో గోల్డ్, సిల్వర్ నిల్వలకు పెద్ద బ్రేక్ పడింది. విదేశాల నుంచి రావాల్సిన టన్నుల కొద్దీ బంగారం, వెండి కస్టమ్స్ క్లియరెన్స్ లేక పోర్టుల్లోనే నిలిచిపోయాయి. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు బ్యాంకులు దిగుమతులను నిలిపివేశాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అసలు ఏం జరుగుతోంది?
భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. అలాగే అతిపెద్ద వెండి కొనుగోలుదారు కూడా. దేశ అవసరాల కోసం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ నెలలో.. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(DGFT) ఏయే బ్యాంకులు బంగారం, వెండి దిగుమతి చేసుకోవాలో అనుమతులు ఇస్తూ ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేస్తుంటుంది.
గత ఏడాది ఇచ్చిన అనుమతి మార్చి 31, 2026తో ముగిసింది. అయితే ఏప్రిల్ సగం దాటినా కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ చిన్న టెక్నికల్ ఆలస్యం కారణంగా సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్దే నిలిచిపోయాయి. అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అధికారులు వీటిని లోపలికి రానివ్వడం లేదు. ఫలితంగా బ్యాంకులు కొత్త ఆర్డర్లు ఇవ్వడం నిలిపివేశాయి.
ప్రభుత్వ వ్యూహం ఉందా?
ప్రభుత్వం ఈ ఉత్తర్వులను కావాలనే ఆలస్యం చేస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో బంగారం, వెండి దిగుమతులను కొంచెం తగ్గించడం ద్వారా వాణిజ్య లోటు పెరగకుండా చూడాలని, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా కాపాడాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆసియా కరెన్సీల్లో రూపాయి పనితీరు ఊహించినంత సానుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణం.
అక్షయ తృతీయ వేళ..
ప్రస్తుతానికి పాత స్టాక్ అలాగే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా మార్కెట్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే 'అక్షయ తృతీయ' రానుంది. భారతీయులు ఈ రోజును బంగారం కొనడానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ ఈలోపు దిగుమతులు సాధారణ స్థితికి రాకపోతే.. మార్కెట్‌లో బంగారం కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వినియోగదారులు సాధారణ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం కొరత వల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. జువెలర్లు, బ్యాంకులు ఇప్పుడు DGFT వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గోల్డ్ షార్టేజీతో ఈ సారి అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గుతాయని బులియన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

