ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ఉద్రిక్తలతో బంగారం భారత ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతోంది. ఒకపక్క రూపాయి పతనం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచుతూ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క కిలో బంగారంపై ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఇప్పుడు అక్షరాలా రూ.22లక్షల 50వేలకు చేరింది. అయితే గతంలో 6 శాతం పన్ను ఉన్నప్పుడు ఒక కిలో బంగారంపై రూ.9 లక్షలు కడితే సరిపోయేది. కానీ ఇప్పుడు వ్యాపారులు రూ.13.5 లక్షలు అదనంగా కట్టాల్సి రావటంతో గోల్డ్ రేటు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది.
ప్రధాని మోడీ ఇటీవల భారతీయులకు ఒక విజ్ఞప్తి చేస్తూ కనీసం ఏడాది పాటు గోల్డ్ కొనుగోళ్లను వాయిదా వేసుకోమన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ పిలుపునిచ్చారు. అయితే పన్నులను ఇంత భారీగా పెంచడం వల్ల మరో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోడీ సర్కార్ నిర్ణయం వల్ల దేశంలో 'గోల్డ్ స్మగ్లింగ్' పెరిగే అవకాశం ఉందని క్యాపిటల్ మైండ్ సీఈఓ దీపక్ షెనాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలాగే దిగుమతి సుంకాలు పెంచినప్పుడు.. ఒక ఐపీఎస్ అధికారి కుమార్తెతో సహా పలువురు విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. 15 శాతం పన్ను అంటే స్మగ్లర్లకు అది భారీ లాభదాయకమైన వ్యాపారంగా మారుతుందని.. దీంతో దేశంలోకి గోల్డ్ అక్రమ రవాణా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు.
భారతీయులకు ఉన్న బంగారం మోజు దేశ వాణిజ్య లోటును ఆకాశానికి చేరుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం ఏకంగా 71.98 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 24 శాతం ఎక్కువ. ఇలా బంగారం కోసం విదేశాలకు డాలర్లు తరలిపోతుండటంతో మన రూపాయి బలహీనపడుతోంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు 2012-13లో అప్పటి ప్రభుత్వం కూడా ఇలాంటి కఠిన చర్యలే తీసుకొచ్చింది. అప్పట్లో కేవలం 2 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని.. 10 శాతానికి పెంచారు. ఫలితంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అప్పట్లో నియంత్రణలోకి వచ్చినా, అక్రమ బంగారం రవాణా కూడా అదే స్థాయిలో పెరిగి తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. ఒకవైపు చమురు దిగుమతులు, మరోవైపు పెరుగుతున్న బంగారం దిగుమతుల వల్ల వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశీయంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగి, వినియోగం తగ్గుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక నిర్ణయంగానే ఉండాలని, లేనిపక్షంలో ఎయిర్ పోర్టుల్లో మళ్లీ స్మగ్లింగ్ ముఠాల స్టోరీలు సర్వసాధారణంగా మారతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు దేశభక్తితో బంగారం కొనడం మానేయాలని ప్రభుత్వం కోరుతుంటే.. మరోవైపు పన్నుల భారం స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ వేస్తుందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ.
