V6 News

ఆల్టైం గరిష్టానికి బంగారం దిగుమతులు.. 2026లో రూ.6.04 లక్షల కోట్ల బంగారం కొనుగోలు

ఆల్టైం గరిష్టానికి బంగారం దిగుమతులు.. 2026లో రూ.6.04 లక్షల కోట్ల బంగారం కొనుగోలు

న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బంగారం దిగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. దిగుమతుల విలువ 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్లకు (రూ.6,04,632 కోట్లకు) చేరింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 58 బిలియన్ డాలర్లు ఉంది. 

బంగారం ధరలు విపరీతంగా దూసుకెళ్లడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. పరిమాణం పరంగా చూస్తే దిగుమతులు 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు చేరుకున్నాయి. వెండి దిగుమతులు కూడా ఏకంగా 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటి వల్ల దేశ వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరింది.

స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా 40 శాతం దిగుమతులు వస్తున్నాయి. యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం దిగుమతులు జరుగుతున్నాయి.  ఇదిలా ఉంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి ధర ఢిల్లీలో శుక్రవారం రూ.5,700 తగ్గి రూ.2.53 లక్షల వద్ద నిలిచింది. పసిడి ధర కూడా 10 గ్రాములకు రూ.1,600 తగ్గి రూ.1.56 లక్షల మార్కుకు చేరింది. దేశీయ మార్కెట్లో కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో ఈ క్షీణత కనిపించింది.