- ఎడ్యుకేషన్ రీజినల్ హెడ్ నవిషా ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: విజ్ఞాన్స్ వర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవం ఒక సాధారణ ప్రయోగశాల ప్రారంభం మాత్రమే కాదని, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను భవిష్యత్తు సాంకేతికతను ప్రపంచానికి సిద్ధం చేసే కీలక ప్రయాణానికి నాంది అని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషనల్ రీజినల్ హెడ్ నవిషా ప్రభాకర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ వర్సిటీలో అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జెమిని ఎంటర్‌ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ప్రభాకర్ మాట్లాడారు. ఫిన్‌టెక్, మెడికల్, రోబోటిక్స్, ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. గూగుల్ భాగస్వామ్య సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈవో బి. మల్లేశు మాట్లాడుతూ ఏపీలో గూగుల్ ఏఐ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన తొలి వర్సిటీ విజ్ఞాన్స్ కావడం గర్వకారణమని తెలిపారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ గూగుల్ ఏఐ ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో కార్యాచరణాత్మకంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల సీఈవో డాక్టర్ కూరపాటి, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
