- ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రాసెసింగ్ పూర్తి
- మేడ్చల్‌లో 3 వేల ఎకరాలు, సికింద్రాబాద్ పరిధిలో 1300 ఎకరాలు గెజిట్‌లోకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కబ్జాకు గురవుతున్న ఎండోమెంట్ భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అన్ని జిల్లాలో దేవాదాయ భూముల చట్టబద్ధ రక్షణ కోసం కలెక్టర్లు గెజిట్‌లో చేరుస్తున్నారు. ఇప్పటి వరకు వక్ఫ్ భూములకే గెజిట్ పబ్లికేషన ఉండగా తొలిసారి ఎండోమెంట్ భూములకూ గెజిట్ ఇస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా అన్ని వివరాలు సేకరించి గెజిట్‌లోకి చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎండోమెంట్ శాఖకు చెందిన భూములు అయినప్పటికీ.. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ భూములు ఇతరులు ఆక్రమించారని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మేడ్చల్, సికింద్రాబాద్, పెద్దపల్లి, వరంగల్‌లో గెజిట్‌లో చేర్చే ప్రక్రియ పూర్తికాగా, మిగతా జిల్లాల్లో రానున్న రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మేడ్చల్ జిల్లాలో మూడువేల ఎకరాలు, సికింద్రాబాద్ పరిధిలో 1300 ఎకరాలు గెజిట్ లో చేర్చారు.
భారీగా భూముల ధరలు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భూముల ధరలు రాష్ర్ట ఏర్పాటు తరువాత భారీగా పెరిగాయి. ఎకరా రూ.30లక్షలపైనే పలుకుతోంది. దేవాదాయ శాఖకు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాలు భూముల విలువ లక్ష కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ల్యాండ్ బ్యాంక్‌ను కాపాడుకోవటం ప్రభుత్వ శాఖలకు సవాల్‌గా మారింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో ఎక్కువ శాతం దేవాదాయ శాఖవే ఉండడం గమనార్హం.
గెజిట్ ప్రాసెసింగ్ కొనసాగుతోంది
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దేవాదాయ శాఖ భూములను గెజిట్‌లోకి చేర్చి, నంబర్ ఇచ్చే ప్రాసెసింగ్ కొనసాగుతోందని దేవాదాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పార. ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా సగం జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను కోరామన్నారు.
ఒక్క సర్వేయరూ లేడు
దేవాదాయ శాఖలో సర్వేయర్ల కొరత నెలకొంది. ప్రస్తుతం ఐదుగురు సర్వేయర్లు కావాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. కరోనా టైమ్‌లో కాంట్రాక్టుగా ప్రైవేట్ సర్వేయర్‌ను నియమించుకోగా ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు. ఇపుడు ఐదుగురు సర్వేయర్లు అవసరం ఉందని, తమ డిపార్ట్ మెంట్‌కు సర్వేయర్లను కేటాయించాలని ఇటీవల రెవెన్యూ శాఖకు లేఖ రాశారు. సర్వేయర్ లేకపోవడంతో భూముల కొలతలో తీవ్ర ఇబ్బంది అవుతోందని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎండో మెంట్ భూములు కబ్జాకు గురవటం, వాటి హద్దులు సరిగా లేవని అధికారులు చెబుతున్నారు.
20 వేల ఎకరాలు కబ్జా
రాష్ట్రంలో దేవాదాయ శాఖకు మొత్తం 87,235 ఎకరాలు భూములు ఉండగా, వీటిలో సుమారు 20,124 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. దేవాలయాల పరిధిలో 2,458 ఎకరాలు ఉండగా, లీజుకు ఇచ్చినవి 21,238 ఎకరాలు, ఖాళీగా 19,692 ఎకరాలు ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 3,488 ఎకరాల భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2021లో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 2,622 ఎకరాలను ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖ బోర్డులు ఏర్పాటు చేశారు.
