మీ ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందొచ్చు : RBI కొత్త స్కీమ్..!

మీ ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందొచ్చు : RBI కొత్త స్కీమ్..!

భారతీయులకు బంగారం అంటే ప్రాణం. పెళ్లిళ్లకైనా, శుభకార్యాలకైనా, డబ్బు అవసరమైనప్పుడు ఆదుకోవడానికైనా మనం బంగారాన్నే నమ్ముకుంటాం. అయితే చాలామంది నగలను కొని  ఇంట్లో  బీరువాలో,  బ్యాంక్ లాకర్లలో పెట్టేస్తారు. అలా ఖాళీగా ఉన్న బంగారంతో లాభం పొందేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక అదిరిపోయే ప్లాన్ చేస్తోంది.

ఏమిటీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్?
ఇది మీ ఇంట్లో లేదా లాకర్‌లో ఖాళీగా ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసే పథకం. 2015లోనే దీనిని ప్రారంభించినప్పటికీ, అప్పట్లో నగలను కరిగించాల్సి వస్తుందనే భయంతో చాలామంది ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆర్‌బీఐ దీనిని కొత్తగా తీసుకురాబోతోంది.

ఇప్పుడు ఎందుకు లాభం?
ఈ మధ్య కాలంలో ప్రజలు నగలు మాత్రమే కాకుండా, పెట్టుబడి కోసం బంగారు నాణేలు, బంగారు బిస్కెట్లు ఎక్కువగా కొంటున్నారు. వీటికి విలువే తప్ప, నగల్లాగా సెంటిమెంట్ ఉండదు. అందుకే వీటిని బ్యాంకుల్లో దాచుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతారని ఆర్‌బీఐ భావిస్తోంది.

మీకు కలిగే ప్రయోజనాలు:
మీ బంగారంపై బ్యాంకులు ఏటా 2% నుండి 2.5% వరకు వడ్డీ ఇస్తారు. కొత్త రూల్స్ వస్తే ఈ వడ్డీ ఇంకా పెరగవచ్చు. అటు బంగారం ధర పెరిగితే వచ్చే లాభం పెరుగుతుంది, ఇటు బ్యాంక్ ఇచ్చే వడ్డీ కూడా తోడవుతుంది. ఇంకా ఇంట్లో బంగారం ఉంటే దొంగతనం జరుగుతుందనే భయం ఉండదు. లాకర్ ఫీజులు కట్టాల్సిన అవసరం కూడా లేదు.

తిరిగి ఎలా తీసుకోవచ్చు?
ఈ స్కీమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లాగే ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు డిపాజిట్ చేసిన బంగారం విలువ ప్రకారం.. అప్పటి రేటుతో నగదుగా గానీ లేదా అంతే విలువైన బంగారంగా గానీ వెనక్కి తీసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇచ్చిన పాత నగలు తిరిగి రావు, కానీ వాటికి బదులు కొత్త బంగారం లేదా  డబ్బు ఇస్తారు.

దేశానికి ఎలా మేలు జరుగుతుంది?
 మన దగ్గర ఉన్న బంగారమే మార్కెట్‌లోకి వస్తే, విదేశాల నుండి బంగారం కొనాల్సిన అవసరం తగ్గుతుంది. విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది, తద్వారా మన రూపాయి విలువ పెరుగుతుంది. బీరువాల్లో ఖాళీగా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమై అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ దగ్గర వాడుకలో లేని బంగారు నాణేలు లేదా బిస్కెట్లు ఉంటే, వాటిని లాకర్‌లో ఉంచి ఫీజులు కట్టే కంటే.. బ్యాంకులో వేసి వడ్డీ పొందడం ఉత్తమమైన మార్గం.