వ్యక్తిని ఇంట్లోనే చంపేసి సమాధి చేసిన కేసును సికింద్రాబాద్ నేరెడ్ మెట్ పోలీసులు చేధించారు. అడ్డ మీద కూలీలుగా పనిచేసే వెంకటరాములు, మల్లేష్‌లు నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఒక గదిలో నివాసం ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 15న పని దొరకకపోవడంతో ఇద్దరూ కలిసి గదిలోనే మద్యం సేవించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు మొదలై.. గొడవ ముదిరింది. ఆవేశంతో ఊగిపోయిన మల్లేష్, వెంకటరాములుపై దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శవాన్ని ఏం చేయాలో తెలియక మల్లేష్ ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. కిచెన్‌లోని గ్యాస్ సిలిండర్ ఉంచే ప్రాంతంలో శవాన్ని పడేసి, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ సిమెంట్‌తో గోడ కట్టేశాడు. ఏమీ తెలియనట్టు అక్కడి నుండి పరారయ్యాడు.
గత మూడు నాలుగు నెలలుగా గది అద్దె చెల్లించకపోవడంతో, ఇంటి యజమాని ఆ గదిని వేరే వాళ్లకు అద్దెకు ఇచ్చారు. కొత్తగా వచ్చిన కిరాయిదారులు చేరిన రెండు రోజులకే ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడం మొదలైంది. అనుమానం వచ్చిన యజమాని, ఆ కొత్తగా కట్టిన గోడను కూలగొట్టి చూడగా.. కుళ్ళిపోయి అస్థిపంజరంగా మారిన వెంకటరాములు మృతదేహం బయటపడింది.
ALSO READ : ఔటర్పై 24 గంటల్లోనే మరో ప్రమాదం..
వెంటనే రంగంలోకి దిగిన నేరేడ్‌మెట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు మల్లేష్‌ను గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
