గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్ 

గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్ 

తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. శనివారం ( మే 2 ) లోక్ భవన్‌లో గవర్నర్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు సీవీ ఆనంద్. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను గవర్నర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం ఇద్దరు కాసేపు సమావేశమయ్యారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను డీజీపీ గవర్నర్‌కు వివరించారు డీజీపీ సీవీ ఆనంద్.

తెలంగాణ కొత్త డీజీపీగా శుక్రవారం ( మే 1 ) సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లక్షీకాపూల్ లో ఉన్న స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 11.05 గంటలకు అధికారులు, కుటుంబ సభ్యుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 30న శివధర్ రెడ్డి పదవీ విరమణ తర్వాత సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు.

తెలంగాణ స్థానికుడు, రాష్ట్ర పోలీస్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ తన కెరీర్ తొలినాళ్లలో పలు జిల్లాల్లో ఎస్పీగా విజయవాడ, సైబరాబాద్, హైదరాబాద్ వంటి కీలక పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్గా, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా, ఏసీబీ డీజీగా, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

పనిచేసిన ప్రతి చోటా తనదైన ముద్రవేశారు సీవీ ఆనంద్. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన పోలీసింగ్ నిర్వహిస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.