స్మార్ట్ మీటర్లు పగిలిపోతున్నయ్.. ఉత్తరప్రదేశ్లో ఊరూరా వ్యాపిస్తున్న మహిళల ఆందోళనలు

 స్మార్ట్ మీటర్లు పగిలిపోతున్నయ్..  ఉత్తరప్రదేశ్లో ఊరూరా వ్యాపిస్తున్న మహిళల ఆందోళనలు

ఉత్తర ప్రదేశ్ లో మహిళలు కన్నెర్ర జేశారు. స్మార్ట్ మీటర్లను బోనాల మాదిరిగా తలపై మోసుకొచ్చి వినూత్న నిరసనలు చేపడుతున్నారు. విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నేలకేసి పగలగొడుతున్నారు. ఒక్క టౌన్ లో మొదలైన ఆందోళనలు.. ఉద్యమం మాదిరిగా రాష్ట్రం అంతా వ్యాపించేలా కనిపిస్తున్నాయి. 

యూపీలో కరెంట్ ఛార్జీల బాదుడుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆగ్రా, ఫిరోజాబాద్ సహా ఇతర పట్టణాల్లో.. వందలాది మహిళలు.. ఇంటికి బిగించిన స్మార్ట్ మీటర్లను పీకేసి.. తలపై మోస్తూ వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫీసుల వరకు మోసుకెళ్లి పగలగొట్టి నిరసనలకు దిగారు. 

స్మార్ట్ మీటర్లపై మహిళ ఆగ్రహంతో ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బిల్లు బాదుడును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. 

ఇప్పుడు స్మార్టు మీటర్లు.. త్వరలో ఈవీఎంలు: అఖిలేశ్ యాదవ్

మహిళల ఆందోళనలపై మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రజలపై విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలు వేస్తే సహించరని అన్నారు. యూపీలో అసలైన దొంగ ఎవరో ప్రజలు గుర్తించారని ట్వీట్ చేశారు. విద్యుత్ రంగంలో అవినీతి బయటపడుతోందని అన్నారు.

 పబ్లిక్ ను దోచుకునేందుకు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రజలు అంత అమాయకులేంద కాదన్నారు. ఇప్పుడు స్మార్టు మీటర్లు పగులుతున్నాయి.. త్వరలో ఈవీఎం లు కూడా పగులుతాయని అన్నారు. మహిళలు స్మార్ట్ మీటర్లు పగలగొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.