ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘భద్రకాళి’ మాఢవీధుల నిర్మాణానికి నిర్ణయం 

వరంగల్‍, వెలుగు : 100 ఏండ్లకు సరిపోయేలా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ చీఫ్​ విప్ ​దాస్యం వినయ్​భాస్కర్​ తెలిపారు. భద్రకాళి ఆలయంలో మాఢవీధుల నిర్మాణంపై శుక్రవారం ఎమ్మెల్సీ శ్రీనివాస్‍రెడ్డి, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍, దివ్యాంగుల అభివృద్ధి కార్పొరేషన్‍ చైర్మన్‍ వాసుదేవరెడ్డి, కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు, స్తపతులు, అధికారులతో కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‍భాస్కర్‍ మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించేలా 60 అడుగుల వెడల్పుతో మాఢవీధుల నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, కుడా నుంచి రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నిర్మాణాల కోసం స్తపతులు, ఎన్‍ఐటీ ఇంజినీర్లు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే సర్వే, డిజైన్‍, ప్లాన్‍ ఆధారంగా పనులు చేయనున్నట్లు చెప్పారు. 

మాఢవీధుల నిర్మాణం బిగ్​టాస్క్​

భద్రాకాళి ఆలయం చుట్టూ మాఢవీధుల నిర్మాణం బిగ్ ​టాస్క్​గా మారనుంది. ఆలయానికి ప్రధాన దారి తప్ప మిగతా మూడువైపులా కొండ, లోయ, చెరువు అడ్డుగా ఉన్నాయి.  ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, మాఢవీధుల నిర్మాణాలు.. వాస్తుతోపాటు శిల్పశాస్త్రం ఆధారంగా చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రధాన పూజరులు, పండితులు మాట్లాడుతూ.. భక్తులు ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో గర్భగుడిలోని అమ్మవారి పాదాల కంటే తక్కువ ఎత్తులో నడవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం చేపట్టే నిర్మాణాలే కాకుండా..  అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ధ్వజ స్తంభం పెట్టాలన్నారు. అయితే ఆలయంలో ఏ పనిచేసినా.. వాస్తుతోపాటు భక్తుల సౌకర్యాలకోసం చేపట్టే నిర్మాణాలన్నీ శిల్పశాస్త్రం ప్రకారం నిర్మించాలని స్తపతులు చెప్పారు. గర్భగుడి ఎదురుగా ధ్వజ స్తంభం నిర్మాణం చేపట్టాలంటే..శిల్పశాస్త్రం ప్రకారం ఇప్పుడున్న స్థలం కాకుండా పద్మాక్షి గుట్ట వైపున ఉండే చెరువు భాగాన్ని కొంత పూడ్చాలి. యాగశాలలు, రథం నిలిపే స్థలం, ఇతరత్రా కట్టడాల కోసం ఎల్‍బీ కాలేజీ వైపున ప్రస్తుతం లడ్డూలు, ప్రసాదాలు తయారుచేసే బిల్డింగ్‍ పక్కనున్న లోయను పూడ్చాలి. ఆలయం పక్కనే అందంగా ఉండే కొండను సైతం 15 నుంచి 20 ఫీట్ల వరకు తొలగించాల్సి ఉంటుందని సమావేశంలో కొందరు అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి :
కుటుంబ సభ్యులతో కలిసి వ్రతంలో పాల్గొన్న మంత్రి దయాకర్​రావు

పర్వతగిరి, వెలుగు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరిలోని మంత్రి తన సొంతింట్లో శుక్రవారం సత్యనారయణ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్​  దేశంలో సమున్నత స్థాయికి చేరుకోవాలని, వారి నాయకత్వంలో రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి జగన్నాథరావు ట్రస్టు బాధ్యులు ఉషా దయాకర్ రావు,  కుమారుడు ప్రేమ్ చందర్​రావు దంపతులు పాల్గొన్నారు.

సూరారంలో ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు

ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం విలేజ్ లోని మెయిన్​ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో  ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు పాతారు. సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయాన్నే పెద్దసంఖ్యలో నిరుపేదలు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ భూమి  51 ఎకరాలలో జెండాలు పాతారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేసిందని, ఇప్పటికైనా స్థలాలు ఇవ్వాలని, లేదంటే  పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి భిక్షపతి, మండల కార్యదర్శి ఊట్కూరి రాములు పాల్గొన్నారు. 

జెండాలు తొలగించాలి.. తహసీల్దార్​

సూరారంలోని ప్రభుత్వ భూమిలో పాతిన జెండాలను తొలగించాలని తహసీల్దార్ రవీందర్ రెడ్డి సీపీఐ నాయకులు, నిరసనకారులకు సూచించారు. ఈ భూమిని హరితహారం కోసం కేటాయించామని, జెండాలు తొలగించకపోతే , చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

నేటి నుంచి ​ షర్మిల పాదయాత్ర

వరంగల్‍, వెలుగు : వైఎస్‍ఆర్‍ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‍ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజుల పాటు యాత్ర అనంతరం వరంగల్​లో సభ నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‍ మండలంలోని పాత ఉప్పల్‍ వద్ద జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది. ఇదే ప్రాంతంలో రాత్రి బస ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు 

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు : లైబ్రరీలు విజ్ఞానాన్ని అందించే భాండాగారాలని మహబూబాబాద్​ కలెక్టర్ శశాంక అన్నారు. జిల్లా కేంద్రంలో నవంబర్ 14 నుంచి నిర్వహిస్తున్న 55వ జాతీయ లైబ్రరీ వారోత్సవాల్లో కలెక్టర్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పుస్తక పఠనంపై ఇంట్రస్ట్​పెంచడం కోసం కృషి చేయాలన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో గుర్తించిన 11 లైబ్రరీలను  అభివృద్ధి పరుస్తున్నామన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, పాలకమండలి  సభ్యులు శ్రీనివాస్, పెద్ది సైదులు,  ప్రేమ కుమార్ పాల్గొన్నారు. 

పట్టపగలే దొంగల బీభత్సం
15 తులాల బంగారం, రూ.లక్ష అపహరణ

హసన్ పర్తి, వెలుగు : కేయూ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎర్రగట్టుగుట్టలో తాళం వేసిన ఉన్న ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. కేయూ సీఐ దయాకర్  వివరాల  ప్రకారం.. ఎర్రగట్టు గుట్టలోని  తిరుమల కాలనీలో నివాసం ఉంటున్న టీఆర్ఎస్ 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ కుటుంబంతో సహా శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సీఐ, ఎస్సైలు సతీశ్, సంపత్ ఘటనాస్థలిని పరిశీలించారు.

ఎంపీ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​రెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు : కల్వకుంట్ల కుటుంబానికి అహంకారం తలకెక్కి ప్రతిపక్ష నాయకుల ఇండ్లపై దాడులకు తెగబడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి అన్నారు.  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇంటిపై దాడిని ఖండిస్తూ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీ రాములుతో రాయపర్తి మండలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ  లక్షలాది మంది ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధి ఇంట్లో చొరబడి పట్టపగలే దాడి చేస్తుంటే..  పోలీసులు పట్టించుకోకపోవడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్ ప్రజలకు నిజం ఏంటో,  నిజాం వారసులు ఎవరో తెల్సని అందుకే కవితను ఓడగొట్టి ఇంటికి పంపించారన్నారు.  ఒక ఆడబిడ్డవు అన్న గౌరవంతో ఇన్నాళ్లు నువ్వు(కవిత) ఎన్ని అరాచకాలు చేసిన సహనంతో చూశామని...  కానీ ఎవరూ లేని సమయంలో  ఎంపీ ఇంటిపైకి100 మంది చిల్లర గాళ్ల గుంపును పంపడం ఆమె రాక్షసత్వానికి అద్దంపడుతుందన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ.. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు టీఆర్ఎస్​ లీడర్లు ఎగిరెగిరి పడుతున్నారన్నారు.

పర్మిషన్​లేని నిర్మాణాల కూల్చివేత 
 

తొర్రూరు, వెలుగు : తొర్రూర్​పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను శుక్రవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డి సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కమిషనర్ గుండె బాబు హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని 
హెచ్చరించారు. 

బ్యాటరీ బైక్​ షోరూంలో అగ్ని ప్రమాదం

జనగామ అర్బన్​, వెలుగు : జనగామలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న శివ బాలాజీ  బ్యాటరీ బైక్​ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది.  శుక్రవారం ఉదయం షోరూంలో బైకు కు ఛార్జింగ్​ పెట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో మూడు బైకులు పూర్తిగా కాలిపోగా కౌంటర్​లోని రూ. 2 లక్షలు, ఫర్నిచర్​, డాక్యుమెంట్లు కాలిపోయాయి.

పత్తి క్వింటాల్​రూ.9,420

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​వ్యవసాయ మార్కెట్​లో శుక్రవారం పత్తి  గరిష్ఠ ధర క్వింటాల్​కు రూ.9,420- పలికింది. వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో క్వింటాల్​రూ.8,910- ధర పలకగా అంతకుమించి స్టేషన్​ఘన్​పూర్​వ్యవసాయ మార్కెట్​లో లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు 20 క్వింటాళ్ల పత్తిని స్థానిక మార్కెట్​కు తీసుకువచ్చారు. అందులో జఫర్​గఢ్​కు చెందిన రైతు మంచాల శ్రీనివాస్​తీసుకువచ్చిన 1.18 క్వింటాళ్ల పత్తికి అధిక ధర దక్కింది. 

పుట్ట మధుపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

మహాముత్తారం, వెలుగు : టీఆర్​ఎస్​ మంథని నియోజకవర్గ ఇన్​చార్జి,  పెద్దపల్లి జడ్పీ  చైర్మన్ పుట్ట మధుపై చేస్తున్న కుట్రపూరిత ప్రచారాలు మానుకోవాలని మహాముత్తారం మండల టీఆర్ఎస్​ లీడర్లు హెచ్చరించారు. శుక్రవారం యామన్ పల్లిలో ఏర్పాటు చేసిన  ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ పుట్ట మధు ఎదుగుదలను ఓర్వలేకనే పార్టీ మారుతున్నాడని ప్రచారం చేస్తున్నారన్నారు.  

మేం తలుచుకుంటే టీఆర్ఎస్ లీడర్లు రోడ్డు ఎక్కలేరు
 

హనుమకొండ సిటీ, వెలుగు : బీజేపీ శ్రేణులకు ఒక్క పిలుపిస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు రోడ్డు ఎక్కలేరని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ఇంటిపై టీఆర్ఎస్​గుండాల దాడిని ఖండిస్తూ శుక్రవారం రావు పద్మ ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో చొరబడి దాడులు చేసే పరిస్థితి తెలంగాణలో రావడం అత్యంత శోచనీయమన్నారు. రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇండ్ల పైన దాడి చేయడం దారుణమన్నారు.  
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ పోస్టాఫీసు సెంటర్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోండేటి శ్రీధర్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఎంపీ ఇంటిపై దాడికి నిరసన 
 

నెట్​వర్క్, వెలుగు : నిజామాబాద్​ఎంపీ ఇంటిపై టీఆర్ఎస్​శ్రేణుల దాడిని ఖండిస్తూ శుక్రవారం బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. ములుగులో పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్​ మాట్లాడుతూ ఎంపీ ఇంటిపై దాడిని ఖండించారు. తొర్రూరులో బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి పెదగాని సోమయ్య , మండలాధ్యక్షుడు పల్లె కుమార్, ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  పాలకుర్తిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్​ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.  వర్ధన్నపేటలో వరంగల్– ఖమ్మం నేషనల్​హైవేపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్​స్తంభించింది. 

19 నుంచి రామప్పలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు
 

వెంకటాపూర్, (రామప్ప), వెలుగు :  రామప్ప టెంపుల్ లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహించనున్నారు. నవంబర్ 19 నుంచి 25 వరకు ఈ వారోత్సవాలు జరుగనున్నాయి. 20న వరంగల్ కోటలో స్థానిక విద్యార్థులతో స్వచ్ఛతా కార్యక్రమాలు, 21న రామప్ప టెంపుల్ లో  చిత్రలేఖనం, వ్యాసరచన, 22న వరంగల్ కోటలో కట్టడాల సందర్శన, 23న వరంగల్ కోటలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, 24న వరంగల్ కోటలో వారసత్వ కట్టడాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఇండోర్ లో బల్దియా టీం

వరంగల్​సిటీ, వెలుగు : ఇండోర్ లో శానిటేషన్ ​నిర్వహణ అద్భుతమని వరంగల్​ మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు.  ఇక్లీ ( ఇంటర్నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ లోకల్​ ఎన్విరాన్​మెంటల్​ ఇన్సియేటివ్స్​) ఆహ్వానం మేరకు ​మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, బల్దియా కు చెందిన ఉన్నతాధికారుల బృందం శుక్రవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో పర్యటించారు. ఇండోర్ లోని ఎంఆర్ఎఫ్ (మెటీరియల్  రికవరీ ఫెసిలిటీ) యూనిట్, బయో గ్యాస్ ప్లాంట్, బయో మైనింగ్ ప్లాంట్ తో పాటు సీఎన్​డీ (కన్స్ట్రక్షన్ అండ్ డేమాలిషన్) వ్యర్థాల నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ కమాండ్​కంట్రోల్ సెంటర్ (ఐ.సి.సి.సి) లను సందర్శించారు. ఆధునిక పద్ధతులపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో బల్దియా హెల్త్​ఆఫీసర్​డా. రాజేశ్, ఈఈ సంజయ్ కుమార్, ఇక్లీ  ప్రాజెక్టు మేనేజర్లు అనురాధ, రీతు పాల్గొన్నారు. 

దళారులకు అమ్మి మోసపోవద్దు

పర్వతగిరి, వెలుగు : రైతులు తాము పండించిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్ధతు ధర పొందాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని వైస్​ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్​రావు అన్నారు. వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కల్లెడ చెరువులో చేపపిల్లలను వదిలిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్​శోభ, లీడర్లు వెంకట్రావు, విజయ్, సారయ్య, లచ్చయ్య, వెంకన్న, వీరయ్య,  యాకయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్రకు బుద్ధి చెప్పాలి
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య 

మొగుళ్లపల్లి,వెలుగు : పేద గిరిజనుల భూములను కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాకీ రాముని మాటలు చెప్తూ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న పాలకులకు, పార్టీలకు కాలం చెల్లిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని, కార్యకర్తలు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రకాశ్​రెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుదర్శన్ గౌడ్, సొసైటీ మాజీ చైర్మన్ లింగారావు, లీడర్లు  రమేశ్, రాజు, రఫీ, మహేందర్, ప్రసాద్  పాల్గొన్నారు. 

గెలుపే లక్ష్యంగా  ముందుకు వెళ్లాలి : అరూరి రమేశ్​

వర్ధన్నపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​అన్నారు. శుక్రవారం వర్ధన్నపేటలోని క్యాంప్ ఆఫీసులో మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ నాయకుడు, కార్యకర్త  బాధ్యతయుతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.