సర్కారు కాలేజీలకూ ఫైర్ సేఫ్టీ.. అన్ని కాలేజీల్లోనూ అగ్నిమాపక పరికరాల ఏర్పాటు

సర్కారు కాలేజీలకూ  ఫైర్ సేఫ్టీ.. అన్ని కాలేజీల్లోనూ అగ్నిమాపక పరికరాల ఏర్పాటు

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది భద్రతా చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రైవేటు కాలేజీల మాదిరిగానే గవర్నమెంట్ కాలేజీలకూ ఫైర్ సెఫ్టీ నిబంధనలు అమలు చేస్తోంది. దీనికోసం అన్ని కాలేజీల్లోనూ ఫైర్ సెఫ్టీ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లలో కొనసాగే కాలేజీలు మినహా, మిగిలిన కాలేజీల్లో వీటిని బిగించారు. దీనికోసం ఇంటర్ బోర్డు అధికారులు రూ.కోటి ఖర్చు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 430 సర్కారు కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో ఫైర్ సెఫ్టీకి చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో కొన్నేండ్ల నుంచి ప్రైవేటు కాలేజీల్లోనే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. సర్కారు కాలేజీల్లో అమలు చేయకుండా.. ప్రైవేటులోనే అమలు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో సర్కారు కాలేజీల్లోనూ ఈ నిబంధనలు అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పరీక్షలు పూర్తయిన వెంటనే, సర్కారు కాలేజీల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. తొలివిడుతలో సొంతభవనాలు ఉన్న 396 కాలేజీల్లో ఈ పరికరాలను బిగించారు. విద్యార్థుల సంఖ్య, కాలేజీ విస్తీరం ఆధారంగా పెద్ద కాలేజీల్లో పది పరికరాలు, చిన్నకాలేజీల్లో ఐదు పరికరాలను ఏర్పాటు చేశారు. తాజాగా స్కూల్ భవనాల్లో కొనసాగుతున్న 35 జూనియర్ కాలేజీల క్లాస్ రూముల్లోనూ ఫైర్ సెఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీచేశారు. 

వారం రోజుల్లో ఈ ప్రక్రియ చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, గతంలో ప్రైవేటు కాలేజీలు మాత్రమే ఫైర్ సేఫ్టీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్​ఓసీ) పొందేవాళ్లు.. కానీ, ప్రస్తుతం సర్కారు కాలేజీలు కూడా ఎన్​ఓసీ పొందాలని ఆదేశాలు వచ్చాయి. ఈ చర్యలతో విద్యార్థులకు, సిబ్బందికి సురక్షితమైన వాతావరణ కల్పిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా, కాలేజీలు రీఓపెన్ అయ్యాక.. ఈ పరికరాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని లెక్చరర్లు, విద్యార్థులు స్వాగతిస్తున్నారు.