యూనివర్సిటీలపై సర్కారు పెత్తనం

యూనివర్సిటీలపై సర్కారు పెత్తనం
  • స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు
  • ఇప్పటికే సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా డిగ్రీ, పీజీ సీట్ల భర్తీ 
  • ఈసారి నుంచి కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు 
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రొఫెసర్లు, స్టూడెంట్​ యూనియన్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీలపై ఇప్పుడు రాష్ట్ర సర్కారు పెత్తనం చెలాయించేందుకు సిద్ధమైంది. వర్సిటీలకు నిధులు ఇచ్చేందుకు నానా తిప్పలు పెడుతున్న ప్రభుత్వం.. ప్రస్తుతం వాటి అస్థిత్వానికే ఎసరు పెడుతోంది. ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తోంది. ఇప్పటికే డిగ్రీ, పీజీ అడ్మిషన్లను సెంట్రలైజ్ చేసిన సర్కారు.. అకడమిక్ అంశాలనూ తన చేతిలోకి తీసుకున్నది. తాజాగా పీహెచ్​డీ సీట్లతో పాటు ప్రొఫెసర్​ పోస్టుల భర్తీని కూడా సెంట్రలైజ్​ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇదంతా యూనివర్సిటీల అధికారాలను, స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని పలువురు ప్రొఫెసర్లు, స్టూడెంట్​ యూనియన్ల లీడర్లు మండిపడుతున్నారు.
జీతాలకు సరిపోయేన్ని నిధులు కూడా ఇస్తలే
రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ పరిధిలో 11 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా బడ్జెట్​లో  వర్సిటీలకు కేటాయించే నిధులు తగ్గిపోతున్నాయి. వర్సిటీల డెవలప్​మెంట్​ కోసం కాదు కదా.. కనీసం జీతాలకు కూడా సరిపోయేన్ని నిధులు ఇవ్వడం లేదు. ప్రతినెలా జీతాలకు పైసలెలా అనే స్థితి నెలకొన్నది. కొన్ని వర్సిటీలు అటానమస్ కాలేజీలలోని, వివిధ డిపార్ట్​మెంట్లలోని నిధులను తీసుకుని ఎంప్లాయీస్​కు జీతాలను సర్దుబాటు చేస్తున్నాయి. 
అడ్మిషన్లన్నీ సెంట్రలైజ్..
ఇదివరకూ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ డిగ్రీ సీట్లను భర్తీ చేసుకునేవి. పీజీ సీట్ల భర్తీకి ఓయూసెట్, కేయూసెట్​పేరుతో ఎంట్రన్స్ టెస్టులు పెట్టి సీట్లను నింపేవి. అయితే ఆరు సంప్రదాయ వర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి 2018–-19లో డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్​ తెలంగాణ(దోస్త్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దోస్త్ పరిధిలోని కాలేజీలకే ఫీజు రీయింబర్స్​మెంట్ అని ప్రకటించారు. 2019–20 అకడమిక్ ఇయర్​ నుంచి కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టు (సీపీగెట్) పేరుతో పీజీ కోర్సులకూ ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో వర్సిటీలు సొంతగా అడ్మిషన్లు చేసుకునే విధానాన్ని సర్కారు దెబ్బతీసినట్లయింది. 
కామన్ అకడమిక్ క్యాలెండర్​
డిగ్రీ, పీజీ అడ్మిషన్లను సెంట్రలైజ్​చేసినా.. క్లాసులు, ఎగ్జామ్స్ నిర్వహణ మాత్రం ఏ వర్సిటీకీ ఆ వర్సిటీ ప్లాన్​ చేసుకునేది. కానీ ఈ ఏడాది నుంచి అన్ని వర్సిటీలకూ కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీంతో వర్సిటీలన్నీ ఉన్నత విద్యామండలి నిర్ణయించే క్యాలెండర్​నే అమలు చేయాల్సి ఉంది.  

పీహెచ్​డీ సీట్లు, ప్రొఫెసర్ పోస్టులపైనా గురి
వర్సిటీల పరిధిలో ఉన్న పీహెచ్​డీ సీట్ల భర్తీతో పాటు వర్సిటీల్లోని టీచింగ్ పోస్టుల భర్తీని కూడా సెంట్రలైజ్ చేయాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. దీనికి తగ్గట్టు ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. వీసీల మీటింగ్ పెట్టి, కొన్ని ప్రపోజల్స్​ను సర్కారుకు పంపించింది. పీహెచ్​డీ  సీట్ల భర్తీని ఎలా చేయాలనే దానిపై కమిటీని వేసింది. ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మూడు ప్రపోజల్స్ ను సర్కారుకు అందించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పంపిన ప్రపోజల్స్​ను సర్కారు ఓకే చేస్తే, ఇక వర్సిటీలన్నీ డమ్మీలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. పీహెచ్​డీ సీట్లు, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని సెంట్రలైజ్​ చేసే ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. అనేక అధికారాలున్న వర్సిటీ వీసీలు సర్కారు చర్యల వల్ల ఉత్సవ విగ్రహాలుగా మారే అవకాశముందని ప్రొఫెసర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.