బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు

బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు

ఈమధ్య కాలంలో అందరిలో ఫిట్నెస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఫిట్ గా ఉండాలన్న ఆలోచనతో చాలా మంది జిమ్ లు, యోగా సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇంకొంత మంది ఇంటివద్దే వర్కౌట్స్ చేస్తూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కొంతమంది కష్టపడకుండా త్వరగా బరువు తగ్గాలన్న భ్రమతో వెయిట్ లాస్ సర్జరీలు చేయించుకొని ప్రాణానికే ముప్పు తెచ్చుకుంటున్నారు.

గతంలో ఆర్తి అగర్వాల్ వంటి సెలెబ్రిటీలు కూడా లైపోసక్షన్ సర్జరీ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో మరణించిన సందర్భాలు చూశాం. అయినా కానీ బేరియాట్రిక్, లైపోసక్షన్ సర్జరీలకు బలవుతున్న వారి సంఖ్య తగ్గట్లేదు. ఇటీవల చెన్నైలో ఓ 26ఏళ్ళ యువకుడు వెయిట్ లాస్ సర్జరీ జరుగుతుండగా మరణించాడు. చెన్నైలోని పమ్మల్ బీపీ జైన్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 150కేజీల బరువున్న హేమచంద్రన్ అనే యువకుడు వెయిట్ లాస్ సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి వెళ్లి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

హేమచంద్రన్ కు మంగళవారం ఉదయం 9:30గంటలకు వెట్ లాస్ సర్జరీ స్టార్ట్ చేశారు డాక్టర్లు. 10:15గంటల సమయంలో హార్ట్ రేట్ నెమ్మదించడం గమనించారు డాక్టర్లు. దీంతో అతన్ని క్రోమ్ పేట్ లోని రేలా హాస్పిటల్ కి తరలించారు డాక్టర్లు. అయినప్పటికీ లాభం లేకపోయింది. అక్కడ హేమచంద్రన్ కు పలు రకాల టెస్ట్ లు చేసి ఐసీయూకి తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించగా ప్రతిపక్షాలు హాస్పిటల్ లైసెన్స్ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి.