భూభారతిపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. జిల్లాకో మండలంలో..

భూభారతిపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. జిల్లాకో మండలంలో..
  • జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి
  • తక్షణమే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం 
  • సాదాబైనామా ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్తుల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కారంలోనూ వేగం పెంచాలని ఆదేశాలు
  • ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జారీ చేసినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ఒక మండలంలో ప్రయోగాత్మకంగా ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ విధానాన్ని త్వరలోనే అమలు చేయాలని ప్రజా ప్రభుత్వం యోచిస్తోంది.

భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలోనే డిజిటల్ సర్వే మ్యాప్‌‌ను జత చేసే ఈ సరికొత్త నిబంధనను ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌‌గా విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, అక్కడ ఎదురవుతున్న క్షేత్ర స్థాయి అనుభవాలు, సాంకేతిక సమస్యలను నిశితంగా పరిశీలించి, రెండో దశ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని ఒక్కో మండలానికి ఈ విధానాన్ని విస్తరించేందుకు తక్షణమే కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌‌లో మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే పరమావధిగా పనిచేస్తోందని, భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు కేవలం ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో 3.65 లక్షల డిజిటల్ పాస్‌‌బుక్‌‌లను రైతులకు పారదర్శకంగా జారీ చేశామని వెల్లడించారు.

గతంలో పాస్‌‌బుక్‌‌ల కోసం రైతులు నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి ఉండేదని, ఇప్పుడు దరఖాస్తు చేసిన వెంటనే నేరుగా చేతికందేలా వ్యవస్థను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌‌లో పడిపోయిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో మరింత వేగం పెంచాలని మంత్రి పొంగులేటి గట్టిగా ఆదేశించారు.

పాత 2020 ఆర్వోఆర్  చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్లే వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని.. కానీ, తమ సర్కార్ ఆ రూల్స్‌‌ను సవరించి రైతులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు. 

15 రోజుల్లోగా నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల్లో ఇప్పటికే 6 లక్షల మందికి నోటీసులు జారీ చేశామని అధికారులు వివరించగా, మిగిలిన దరఖాస్తుదారులకు కూడా రాబోయే 15 రోజుల్లోగా నోటీసుల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి గడువు విధించారు.

నోటీసులు ఇచ్చిన తర్వాత కేటాయించిన 30 రోజుల గడువు ముగిసిన వెంటనే, అర్హులైన ప్రతి ఒక్క రైతు దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించి భూమి హక్కులు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని, పేద రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పక్కాగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.