ఓఆర్ఆర్ లిమిట్స్ లో .. సర్కారీ కార్పొరేట్ స్కూళ్లు

ఓఆర్ఆర్ లిమిట్స్ లో .. సర్కారీ కార్పొరేట్ స్కూళ్లు
  • తొలిదశలో 4 జిల్లాల్లో 23 స్కూళ్ల ఏర్పాటుకు సర్కారు ప్లాన్
  • ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ దాకా ఒకే చోట క్వాలిటీ ఎడ్యుకేషన్ 
  • కొత్తగా 12 బిల్డింగ్​లు, 11 చోట్ల అప్‌‌గ్రెడేషన్ 
  • స్కూల్ కోసం ఎకరానికి పైగా జాగా ఉంటేనే పర్మిషన్ 

హైదరాబాద్, వెలుగు: పేద, మధ్య తరగతి విద్యార్థులకు బస్తీల్లోనే ‘అంతర్జాతీయ’ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల జనసాంద్రత ఎక్కువగా ఉండి, ప్రభుత్వ స్కూళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 23 స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, సర్కారు తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి భూసేకరణ సవాల్‌‌గా మారింది.  

కనీసం ఎకరం, ఆపై స్థలం ఉన్న చోటనే వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ, కొన్ని చోట్ల అధికారులు చూపించిన స్థలాలు అర ఎకరం కంటే తక్కువగా ఉండటంతో, మరోచోట స్థలాలు చూడాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ రోజురోజూకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు నగర శివారులోని సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి జిల్లాల నుంచి భారీగా వలసలు పెరుగుతున్నాయి. 

అయితే, చాలా చోట్ల సర్కారు స్కూళ్లు ఉన్నా.. వాటిలో పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ మొగ్గుచూపడం లేదు. చిన్నచిన్న పనులు చేసుకునే పేరెంట్స్ కూడా ప్రైవేటు స్కూళ్ల వేపే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సంపాదనలో భారీగానే వారి పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నారని అధికారుల అంతర్గత సర్వేలో తేలింది. దీన్ని సర్కారు సీనియస్​ గా తీసుకున్నది. సర్కారు బడుల రూపురేఖలు మార్చాలని డిసైడ్ అయింది. దీంతో సకల సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయిలో తొలిదశలో 23 బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ఆయా బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, విశాలమైన లైబ్రరీ, ప్లే గ్రౌండ్స్ వంటివి ఏర్పాటు చేసి ‘క్వాలిటీ ఎడ్యుకేషన్’ అందించనున్నారు. ప్రస్తుతం 23 స్కూళ్లతో మొదలుపెట్టి.. భవిష్యత్తులో దశలవారీగా మరిన్ని స్కూళ్లను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే,  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో 12 చోట్ల కొత్త భవనాలు నిర్మిస్తుండగా, 11 చోట్ల హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలుగా అప్‌‌గ్రేడ్ చేయనున్నారు. 

స్థలాల ఎంపిక తర్వాత టెండర్లు..  

పిల్లలకు అన్ని వసతులు కల్పించాలంటే తగినంత స్థలం ఉండాల్సిందేనని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే, విద్యాశాఖ అధికారులు గుర్తించిన బాచుపల్లి, అమీర్‌‌పేట, మారేడ్‌‌పల్లి, బండ్లగూడ, సరూర్ నగర్, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో ఎకరం లోపే స్థలం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవలే లేఖ రాశారు. ఆ స్థలాల వివరాలు రాగానే.. సర్కారుకు టెండర్ల కోసం ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంది. 

కొత్త బడులు, భవనాలకు రూ. 572 కోట్లు

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ' (- క్యూర్) ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో కొత్త స్కూళ్ల ఏర్పాటు, ఉన్నవాటిని అప్‌‌గ్రేడ్ చేయడం కోసం రూ.587 కోట్లు అవసరమవుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అంచనా వేశారు. వీటికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవలే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోసల్ సర్కారుకు లేఖ రాశారు. 

కలెక్టర్లు అప్పగించిన స్థలాల్లో 12 కొత్త పాఠశాలల నిర్మాణానికి రూ. 371.50 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న 6 బడులకు సొంత భవనాల నిర్మాణం కోసం రూ. 103.25 కోట్లు కేటాయించాలని కోరారు. మొత్తంగా సివిల్ వర్క్స్, కొత్త నిర్మాణాల కోసమే రూ. 572.75 కోట్లతో పరిపాలనా అనుమతులు కోరారు.

కొత్త స్కూళ్లు ఇక్కడే.. 

  •  రంగారెడ్డి జిల్లాకు 11 స్కూళ్లు మంజూరయ్యాయి. కొత్త భవనాలను లింగోజిగూడ, సరూర్ నగర్, లక్ష్మీగూడ (రాజేంద్రనగర్), కిస్మత్‌‌పూర్ (గండిపేట), బాలాపూర్, రామదాసుపల్లి (ఇబ్రహీంపట్నం), బాగ్ హయత్‌‌నగర్, చందానగర్ లో నిర్మించనుండగా, భూపేష్ గుప్తా నగర్, జల్‌‌పల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లోని స్కూళ్లను అప్​గ్రేడ్ చేయనున్నారు. 
  •  హైదరాబాద్  జిల్లాలో ఆరు స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనాలను అమీర్‌‌పేట (బీకే గూడ), ఖైరతాబాద్ (యూసుఫ్‌‌గూడ)లో నిర్మించనుండగా, మారేడ్‌‌పల్లి (ఎంజీ నగర్), కందికల్ గేట్, హాఫిజ్ బాబా నగర్ (బండ్లగూడ), ధూల్‌‌పేట (ఆసిఫ్ నగర్)లో అప్​గ్రేడ్ చేయనున్నారు. 
  •  మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాకు నాలుగు స్కూళ్లు సాంక్షన్ అయ్యాయి. బాచుపల్లి , గాజులరామారంలో కొత్త స్కూళ్లు రాబోతుండగా..  పాతుల్లగూడ (ఉప్పల్),    పోచారం (ఘట్‌‌కేసర్)లో ప్రస్తుతమున్న స్కూళ్లను అప్​గ్రేడ్ చేయనున్నారు. మరోపక్క  సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌‌పూర్ ( 2 బీహెచ్​కే ఫేజ్-2), కొల్లూరు (బీ బీహెచ్​కే ఫేజ్-1)లోని స్కూళ్లను అప్​గ్రేడ్​ చేయనున్నారు.