ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ' మీర్జాపూర్'(Mirzapur) ఇప్పుడు థియేటర్లను షేక్ చేయడానికి సిద్దమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మీర్జాపూర్: ది మూవీ' అఫీషియల్ టీజర్ ను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు బుల్లి స్క్రీన్లపై రౌడీయిజం, పవర్ పాలిటిక్స్ చూపించిన కాలీన్ భయ్యా, గుడ్డూ పండిట్.. ఇకపై వెండితెరపై విశ్వరూపం చూపించబోతున్నారు. 2018లో మొదలైన ఒరిజినల్ కథాంశాన్ని రీబూట్ చేయకుండా.. అదే టైమ్‌లైన్‌ను కొనసాగిస్తూ సరికొత్త బిగ్గర్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ఒకే ఫ్రేమ్‌లో పాత-కొత్త గ్యాంగ్..
ఈ టీజర్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విజువల్స్ ఉన్నాయి. కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీఎంట్రీ ఇచ్చారు. అయితే అందరినీ షాక్‌కు గురిచేస్తూ.. జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నారు. పూర్వాంచల్ వీధుల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు.. ఈసారి మీర్జాపూర్ సామ్రాజ్యం మరింత విస్తరించబోతోంది. రక్తం మరిగే యాక్షన్ సీన్స్, గూస్‌బంప్స్ డైలాగ్స్‌తో వెండితెర దద్దరిల్లడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే..
ఈ క్రేజీ మూవీలో రసిక దుగ్గల్, అభిషేక్ బెనర్జీ, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్గాంకర్, సోనాల్ చౌహాన్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అమెజాన్ MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 4, 2026న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.
