కొత్తగా పెళ్లయ్యింది..20 రోజుల క్రితమే ఇల్లు అద్దెకు తీసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేశారు. భర్త ప్రైవేట్ కంపెనీలో జాబ్, భార్య ఓ షాప్ లో పని చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఏమైందో ఏమో కానీ.. షాప్ లో పని చేసుకుంటూ.. ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన నవ వధువు ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది ఈ విషాద ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన దగ్గర బంధువైన యాండ్రాపు మురళీతో ఈ ఏడాది మే 13వ తేదీన కృష్ణ వేణికి పెళ్లయ్యింది. మురళీ ఓ కంపెనీ లో పనిచేస్తుండగా, కృష్ణవేణి గోపాల పట్నం ప్రాంతంలోని షాప్ లో పని చేస్తోంది. కొత్తగా పెళ్ళైన వీరు గత 20 రోజులుగా పీఎంపాలెంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఈ క్రమంలో మురళీ బుధవారం ఉదయం డ్యూటీ నుండి రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్ కు ఉరేసుకుని విగ తజీవిగా కనిపించింది. దీంతో మురళీ స్థానిక పోలీసులకు సమాచారమందించారు.
వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
