పోడు భూములపై మరోసారి సర్కార్ డబుల్ గేమ్

పోడు భూములపై మరోసారి సర్కార్ డబుల్ గేమ్
  • సర్కారు తీరు ఇట్ల
  • పట్టాలు ఇస్తమని ఆదివాసీలకు హామీ
  • మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశం
  • 3.4 లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం
  • పట్టాల కోసం ఆర్నెల్లుగా రైతుల ఎదురుచూపులు
  • 24 జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పోడు సమస్య


జయశంకర్‌ ‌భూపాలపల్లి / ఆదిలాబాద్, వెలుగు: అడవిబిడ్డలు సాగు చేసుకుంటున్న పోడు భూములపై రాష్ట్ర సర్కారు మరోసారి డబుల్ గేమ్ మొదలుపెట్టింది. అర్హత ఉన్న రైతులకు పోడు పట్టాలిస్తామని ఆరు నెలల కింద 3.4 లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకున్న సర్కార్ వాటిపై ఇప్పటి దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హరితహారం కింద అటవీభూముల్లో మొక్కలు నాటాలని ఫారెస్ట్ ఆఫీసర్లకు టార్గెట్లుపెట్టింది. ఈ క్రమంలో పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమవుతుండగా, ప్రాణాలు పోయినా సరే భూములను కాపాడుకుంటామని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ సారి కూడా అటవీ గ్రామాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనుల నడుమ పోడు పోరు తప్పేలా లేదు. ఆదిలాబాద్, -ఆసిఫాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లి, -కొత్తగూడెం, ఖమ్మం, నాగర్​కర్నూల్ సహా 24 జిల్లాల్లోని 10 లక్షలకుపైగా ఎకరాల్లో  పోడు భూముల సమస్య ఉంది. 



మొత్తంగా 2,450 ఆదివాసీ గ్రామాల్లో గోండు, కొలాం, నాయక్​పోడ్, బంజారా, కోయ, తోటి లాంటి తెగలతో పాటు గిరిజనేతరులు ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు హక్కు పత్రాలు అందించారు. అప్పట్లో1,83,252 అప్లికేషన్లు రాగా 1,01,177 మందికి హక్కు పత్రాలు అందించి, వివిధ కారణాలతో 82,075 దరఖాస్తులు తిరస్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కూర్చి వేసుకొని కూర్చొని మరీ పోడు రైతులకు పట్టాలు ఇస్తామని నవంబర్‌‌‌‌23, 2018న మహబూబాబాద్‌‌ ‌‌బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టాల సంగతి మరిచిపోయి హరితహారం కింద ఏటా పోడు భూముల్లో ఫారెస్టోళ్లతో మొక్కలు నాటిస్తున్నారు. మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్​ సిబ్బందిని గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువైపులా దాడులు, పోడు రైతులపై కేసులు చోటుచేసుకుంటున్నాయి. ఆసిఫాబాద్, ఖమ్మం లాంటి జిల్లాల్లో చంటి పిల్లల తల్లులను కూడా అరెస్ట్​ చేసిన సర్కారు తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గిరిజన సంఘాల నేతలతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో అర్హులైన గిరిజనులకు పట్టాలిస్తామని గతేడాది అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మరోసారి ప్రకటించారు. సర్కారు ఆదేశాలతో ఆఫీసర్లు గతేడాది నవంబర్‌‌ లో హడావుడి చేశారు. సెప్టెంబర్​16న మంత్రి సత్యవతి రాథోడ్ చైర్​పర్సన్​గా మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా కేబినెట్ సబ్​కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఉన్నతాధికారుల పర్యటనలు, ఫీల్డ్ లెవల్​లో ఆఫీసర్ల ఎంక్వైరీలను చూసి ఇక పోడు భూములకు పట్టాలు వచ్చేసినట్లే నని గిరిజనులు భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.4 లక్షల మంది గిరిజన రైతులు 12 లక్షల ఎకరాల భూముల కోసం దరఖాస్తులు ఇచ్చారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అప్లికేషన్లను స్క్రూటినీ కూడా చేసిన పాపాన పోలేదు.

పోడు భూముల్లో హరితహారానికి ఏర్పాట్లు

ఓవైపు పోడుభూములకు పట్టాలు వస్తాయని గిరిజనులు ఎదురుచూస్తుండగా, సర్కారు మాత్రం వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 8వ విడత హరితహారంలో ఎప్పట్లాగే ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు టార్గెట్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు19 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం విధించగా, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏకంగా 5 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించడం ద్వారా పోడు రైతులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే అటవీశాఖ ఆధ్వర్యంలో 550 నర్సరీలను ఏర్పాటు చేసి 6.5 కోట్ల మొక్కలు పెంచుతున్నారు. ఆయా మొక్కలను నాటేందుకు వారం రోజులుగా ఫారెస్టోళ్లు పోడు భూములను చదును చేస్తుండడంతో గిరిజనులు అడ్డుకుంటున్నారు. ఇటీవల కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా పెంచికల్​పేట మండలం కొండపల్లి గ్రామంలో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు హరితహారం మొక్కల కోసం భూములను చదును చేయడానికి ప్రయత్నించగా ఓ పోడు రైతు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. రెండు, మూడేండ్లుగా పోడు భూముల్లో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు రావడం, గిరిజనులు అడ్డుకోవడం, ఈ క్రమంలో గొడవలు జరగడం పరిపాటిగా మారింది.  ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది గిరిజనులపై  కేసులు పెట్టారు. ఒక్క కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కిందటేడు పోడు భూముల ఇష్యూలో 100 మందికి పైగా ఆదివాసీలు కేసులపాలయ్యారు. కాగజ్ నగర్ మండలం సార్సల ఇష్యూలో 39 మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇకనైనా పోడు భూముల పోరాటం, కేసుల నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తే సర్కారు తీరుతో అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు.

గిరిజనులను రక్షించాలి.. పోడు భూముల సంగతి తేల్చేయాలి.. 

ఆ పేద ఆదివాసీలకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి.. వాళ్లు బతకాలి.. వాళ్లూ మన బిడ్డలే.. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా.. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలందరినీ తీసుకెళ్లి తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బార్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా అని ఇచ్చేస్తాం.. 

ఫైనల్‌ చేసేస్తం’’.

‑ 2019 జులైలో పోడు భూములపై  అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ల నుంచి అక్టోబర్ మూడో వారంలో అప్లికేషన్లు తీసుకోవాలి.. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా నవంబర్‌లో సర్వే ప్రారంభించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టాలు అందజేయాలి. 
‑ 2021 అక్టోబర్​9న హైలెవల్ మీటింగ్​లో సీఎం కేసీఆర్

ఫారెస్టోళ్లు అరిగోస పెడుతున్నరు

వానకాలం రాంగనే ఫారెస్టోళ్లతో అరిగోస అయితున్నది. మేం వేసుకొన్న పంటలు ధ్వంసం చేస్తున్నరు. మా భూముల్లో మొక్కలు నాటుతున్నరు. పట్టాలు ఇస్తమంటే దరఖాస్తు పెట్టుకున్నం. పట్టాలు వస్తయేమోనని చూస్తంటే ఇప్పుడు మళ్లీ మొక్కలు నాట్తరట. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చుడు తర్వాత మరిచిపోవుడు సర్కారుకు అలవాటైంది. 
- సిడం యేషు, పునాగూడ గోపేర, తిర్యాణి

మా భూముల్లోకి వస్తే తరిమికొడ్తం
మా ఆదివాసీలు అడవికి హక్కుదారులు. పోడు భూముల జోలికి వస్తే ఊకోం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. అర్హులైన ఆదివాసీలకు ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలి. అట్లకాకుంట హరితహారం కింద పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఫారెస్టోళ్లను తరిమితరిమి కొడ్తాం.
- పోడెం బాబు, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ములుగు జిల్లా

పట్టాల కోసం ఎదురుచూస్తున్నాం

మా తాత ముత్తాతల కాలం నుంచి పోడు చేసుకుంటున్న భూమికి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టాలు ఇస్తలేదు. పైగా ఏటా వానకాలం రాంగనే మా భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు వస్తున్నరు. మా భూమి మాది కాదంటున్నరు. బ్యాంకుల నుంచి లోన్లు రావు. మాకు మేము తిప్పలు పడి సాగుచేసుకుంటే వద్దంటున్నరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదు.

‌‌‌‌- ఇనుముల మల్లేశ్, బోర్లగూడెం, మహాముత్తారం మండలం, భూపాలపల్లి జిల్లా

తిరుగుబాటు తప్పది.. 

పోడు భూములకు పట్టాలిస్తామని ఎఫ్ఆర్ సీ కమిటీల ద్వారా దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. తీరా ఇప్పుడు హరితహారం కింద మొక్కలు నాటుతామని ఫారెస్టోళ్లు వస్తే తిరుగుబాటు తప్పది. సాగులో ఉన్న పోడు భూముల జోలికి వచ్చినవాళ్లకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలె. పోడు రైతులు కలిసికట్టుగా ఫారెస్టోళ్లను అడ్డుకోవాలె. ఎట్టి పరిస్థితుల్లోనూ హరితహారం మొక్కలు నాటకుండా చూడాలి. 
- భూక్యా వీరభద్రమ్, పోడు భూముల పరిరక్షణ కమిటీ నాయకుడు, ఖమ్మం