టెట్ రిజల్టొచ్చి రెండు నెలలైతున్నా పట్టించుకోని ప్రభుత్వం

టెట్ రిజల్టొచ్చి రెండు నెలలైతున్నా పట్టించుకోని ప్రభుత్వం
  • ఎనిమిదేండ్లలో ఒక్కసారే నోటిఫికేషన్.. అది కూడా 2017లో..
  • టెట్ రిజల్టొచ్చి రెండు నెలలైతున్నా పట్టించుకోని ప్రభుత్వం
  • ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు 

హైదరాబాద్, వెలుగు: టీచర్​ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నానుస్తూనే ఉంది. ఏపీలో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్​ రిలీజ్​ కాగా.. మన దగ్గర మాత్రం ఊరిచ్చుడు తప్ప ఆ దిశగా చర్యలేమీ లేవు. డీఎస్సీని టీఆర్టీగా మార్చిన రాష్ట్ర సర్కారు ఎనిమిదేండ్లలో కేవలం ఒకే ఒక్కసారి అది కూడా ఐదేండ్ల కింద నోటిఫికేషన్​ వేసింది. ఆ పోస్టుల భర్తీ ఇంకా పూర్తికాలేదు. టెట్​ రిజల్ట్​ వచ్చి 2 నెలలు కావస్తున్నా ప్రభుత్వం టీచర్​ పోస్టుల భర్తీపై స్పందించడం లేదు. పోస్టులను భర్తీ చేస్తామంటూ ఏడాదిన్నర నుంచి సీఎం కేసీఆర్​ చెప్పడం తప్ప భర్తీ చేయడం లేదని లక్షల మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అప్పట్లో మెగా డీఎస్సీ అని చెప్పి..!

ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలు చేపట్టారు. 2013లో మెగా డీఎస్సీ వేస్తామని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించగా.. అప్పట్లో కేసీఆర్ అభ్యంతరం చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే నోటిఫికేషన్ ఆశ అంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక తామే మెగా డీఎస్సీ నిర్వహించుకుంటామని కేసీఆర్​ అప్పట్లో ప్రకటించారు. కానీ, 2014లో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. తెలంగాణ రాగానే మెగా డీఎస్సీ వేస్తారనే ఆశతో లక్షల మంది అభ్యర్థులు కోచింగ్​బాటపట్టారు. కానీ సర్కారు పెద్దలు మాత్రం.. రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అనివార్యంగా 2017లో 8,792  టీచర్​ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్‌‌ రిలీజ్ చేసింది. అప్పటి వరకు ఉన్న డీఎస్సీని టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్​ (టీఆర్టీ)గా మార్చి నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ పోస్టుల్లో ఇంకా కొన్నింటిని అర్హులు లేరనే కారణంతో భర్తీ చేయలేదు. 

ఏపీలో మూడోసారి

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 9,061 పోస్టుల భర్తీకి 2014లో డీఎస్సీ నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. ఆ తర్వాత 2018లో 7,729 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చారు. తాజాగా మరో 502 పోస్టుల భర్తీకి అక్కడి ప్రభుత్వం లిమిటెడ్ రిక్రూట్మెంట్ పేరుతో నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. ఇందులో జెడ్పీ, ఎంపీపీ స్కూల్స్‌‌లో 199 పోస్టులు, మోడల్ స్కూల్స్‌‌లో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ స్కూళ్లలో 15, స్పెషల్ ఎడ్యుకేషన్ లో 81 పోస్టులు ఉన్నాయి. త్వరలోనే మరోసారి నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఏపీలో మూడోసారి నోటిఫికేషన్​ రాగా, కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక్క నోటిఫికేషన్ రావడం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆ పోస్టులు కూడా ఏపీలో భర్తీ చేసిన వాటిలో సగం కూడా లేవని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తప్పనిసరిగా రెండేండ్ల కోసారి డీఎస్సీ నిర్వహించేవారు. కానీ, ఎనిమిదేండ్లలో తెలంగాణలో ఒక్క టీఆర్టీతోనే సరిపెట్టుకోవాల్సి 
వచ్చింది. 

ఉర్దూ స్పెషల్ డీఎస్సీ నిర్వహించలే 

రాష్ట్రంలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని అనేక సార్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. 2006 డీఎస్సీ నుంచి ఉర్దూ టీచర్ పోస్టులు ఏనాడూ పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 1,215 ఉర్దూ టీచింగ్​ పోస్టుల భర్తీకి కేబినెట్​ ఆమోదం తెలిపింది. కానీ టీఆర్టీ –2017 నోటిఫికేషన్​లో 900 పోస్టులనే భర్తీ చేస్తామని ప్రకటించారు. వాటిలోనూ 365 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 535 పోస్టులకు అర్హులు లేరని అధికారులు పక్కనపెట్టారు. వీటిలో మొత్తం 636 ఎస్జీటీ పోస్టులకు గానూ కేవలం 301 పోస్టులు భర్తీ అయ్యాయి. పీఈటీలు 42 ఉంటే కేవలం 4 పోస్టులే భర్తీ అయ్యాయి. అయితే స్పెషల్ డీఎస్సీ కోసం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మైనార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినా, అది ముందుకు సాగలేదు. 

ఖాళీలు 20 వేల దాకా ఉన్నా..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ వేస్తారని అభ్యర్థులంతా ఆశించారు. కానీ 2017లో కేవలం 8,792 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్​ వచ్చింది. ఆ తర్వాతి ఏడాదిలోనే మరిన్ని టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు పెద్దలు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకూ మరో టీఆర్టీని వేయలేదు. టీచర్​ పోస్టులు భర్తీ చేస్తామంటూ 2020 డిసెంబర్​ నుంచి సీఎం కేసీఆర్​, మంత్రులు చెప్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ త్వరలోనే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామనీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సర్కారు స్కూళ్లలో శాంక్షన్డ్ పోస్టుల ప్రకారం.. సుమారు 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో మాత్రం 16 వేల టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సెకండరీ ఎడ్యుకేషన్​లో 13,086 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. అవి ఏ డిపార్ట్​మెంట్​వి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, సర్కారు బడుల్లో కేవలం 9వేల పోస్టులనే భర్తీ చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు. అది కూడా ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పడం లేదు. ఈ అకడమిక్​ ఇయర్​ నుంచి స్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియం ప్రవేశపెట్టినప్పటికీ.. టీచర్​ పోస్టులను మాత్రం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. కనీసం విద్యావలంటీర్లను కూడా తీసుకోలేదు. టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే, మరో పదివేల ఖాళీలు ఏర్పడుతాయని టీచర్ల సంఘాలు చెప్తున్నాయి. అన్ని ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్​ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు. 

టీచర్​ పోస్టులను భర్తీ చేయాలి

నిరుద్యోగ జేఏసీ డిమాండ్​

ముషీరాబాద్, వెలుగు: గవర్నమెంట్​ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన బుధవారం ‘నిరుద్యోగ గర్జన’ సభ జరిగింది. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఆరు నెలల్లో భర్తీ చేస్తున్నారని, కానీ పదేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. టీచర్ల కొరత వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడిందని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యారంగానికి నిధులు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నదని ప్రశ్నించారు. వెంటనే  టీచర్​ పోస్టులను భర్తీ చేయాలని, లేకపోతే పాఠశాల డైరెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. 

స్కూళ్లకు రంగులేస్తె సరిపోతదా? 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి. కొత్తగా ప్రారంభించిన ఇంగ్లిష్ మీడియం కోసం స్పెషల్ టీఆర్టీని వేయాలి. ‘మన ఊరు మనబడి’ పేరుతో బడుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని, రంగులు వేస్తున్నామని సర్కారు చెప్తున్నది. టీచర్​ పోస్టులు భర్తీ చేయకుండా స్కూళ్లకు రంగులేస్తె సరిపోతదా? 

‑ సదానందంగౌడ్, 
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు