ఈ–పంచాయతీ అమలెట్ల?

 ఈ–పంచాయతీ అమలెట్ల?
  • సగం ఊర్లలో కంప్యూటర్లే లేవ్​..
  • ఉన్న చోట రిపేర్ల సమస్య 
  • 12,769 గ్రామాలకు 4,800 గ్రామాల్లో సిస్టమ్స్
  • మండల కేంద్రాలకెళ్లి రిపోర్టులిస్తున్న సెక్రటరీలు 
  • ఆపరేటర్ల కొరత ఉందంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీలను కంప్యూటర్ల కొరత వేధిస్తోంది. రాష్ర్టంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా కేవలం 4,800 ఊర్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. 8 ఏండ్ల కింద కొనడంతో చాలా చోట్ల రిపేర్లు వస్తున్నాయని సెక్రటరీలు చెబుతున్నారు. పేపర్లు, ప్రింటర్లు, టోనర్లు సరిగా లేవని బయట ప్రింట్స్ తీసుకుంటున్నామని వాపోతున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ–పంచాయతీ అనుకున్నంత ఆశాజనకంగా ముందుకు వెళ్లటం లేదు. ఎంపీడీవో ఆఫీసుల్లో కంప్యూటర్లు ఉన్న చోట ఆపరేటర్లు తక్కువ ఉన్నారు. ఒక్కో  మండలంలో కనీసం 20 పైనే గ్రామాలు ఉండగా ఇన్ని గ్రామాల పనులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు.

సిబ్బంది తక్కువ.. సర్వీసులు ఎక్కువ.. 
నిత్యం గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఊర్లో జరిగే  సిటిజన్ సర్వీస్ లు, బిల్లులు, మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్, ఈ–గ్రామ స్వరాజ్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్లు, లే ఔట్​ పర్మిషన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటి వివరాలను రిపోర్టుల రూపంలో రెడీ చేసి అధికారులు అందజేయాలి. కంప్యూటర్లు లేని చోట  మండల కేంద్రాలకు వెళ్లి రిపోర్టులు రెడీ చేయడం ఇబ్బంది అవుతోందని సెక్రటరీలు చెబుతున్నారు. 

ఊర్లలో నెట్ సమస్యలు
ఇక గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల ఇంటర్ నెట్ సమస్య వేధిస్తోంది. ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇప్పటికీ ఇంటర్ నెట్ సమస్య ఉందని సెక్రటరీలు చెబుతున్నారు. ప్రస్తుతం సెక్రటరీలు మొబైల్ ఫోన్లలో డీఎస్ఆర్ యాప్ లో వివరాలు అప్లోడ్ చేస్తున్నప్పటికీ మిగతా పనులకు ఇప్పటికీ చాలా చోట్ల రికార్డులను కొనసాగిస్తున్నారు.

ప్రతీ ఊరుకి కంప్యూటర్లు ఇవ్వాలె..
ఉన్న కంప్యూటర్లు మండల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పని చేస్తున్నా.. స్టేషనరీ లేదు. ప్రింటర్లు, స్కానర్లు లేవు. నెల యాక్టివిటీలు, డీపీవో ఆఫీస్ వచ్చే రిపోర్టులు రెడీ చేయాలె. సాఫ్ట్​వేర్​లో డేటా ఎంట్రీ చేయాలె.. 7 గ్రామాలకు కలిపి ఒకే ఆపరేటర్ ఉన్నడు. డీఎస్ఆర్ యాప్ తో కొంత రిస్క్ తగ్గింది. టీ ఫైబర్ లైన్లు వేసిండ్రు. మీటర్లు పెట్టిండ్రు. కంప్యూటర్లు లేనపుడు ఈ లైన్లు వృథాగా ఉన్నాయి. 
- తొర్రూరుకు చెందిన ఓ సెక్రటరీ