GT vs PBKS: మిరాకిల్ అంటే ఇదే.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్

GT vs PBKS: మిరాకిల్ అంటే ఇదే.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్

టార్గెట్ 200 పరుగులు.. ఛేదనలో 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్.. 119/5. విజయానికి చివరి 7 ఓవర్లలో 81 పరుగులు కావాలి.. చేతిలో 5 వికెట్లు.. క్రీజులో అనామక బ్యాటర్లు.. ఇంకేముంది గెలుపు గుజరాత్‌దే అని అంతా అనుకున్నారు. కానీ, తీరా చూస్తే మ్యాచ్ ఫలితమే మారిపోయింది. అనామక బ్యాటర్లు అనుకున్న ఆ యువకులే.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి బౌలర్లను తునాతునకలు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించారు. ఫలితంగా ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఒక బంతి మిగిలివుండగానే చేధించారు. ఛేదనలో శశాంక్ సింగ్ (61 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు) విజయంలో కీలక పాత్ర పోషించగా.. అశుతోష్ శర్మ(31; 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు.

అంతకుముందు శుభ్‌మన్ గిల్(89; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు),సాయి సుదర్శన్ (33; 19 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్ తెవాటియా(23 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో గుజరాత్ టైటన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్, కగిసో రబాడా తమ 4 ఓవర్ల కోటాలో చెరో 44 పరుగులిచ్చారు.