హైదరాబాద్, వెలుగు: గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షకు 86.54 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈమేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు ప్రకటించారు. తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మొదటి రోజు 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 9,450 మంది హాజరయ్యారని చెప్పారు. మొదటి సెషన్లో 4,368 మంది, రెండో సెషన్లో 4,720 మంది, మూడో సెషన్లో 362 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని చెప్పారు. పరీక్ష తేదీలను తెలుసుకుని వారం రోజుల ముందే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.
