వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి

వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి

ఆమె ఓ వృద్ధురాలు. అతడు సరిగా నడవలేని దివ్యాంగుడు. ఒంటరిగా ఉంటున్న ఆమె ఇంటిని సొంతం చేసుకోవడానికి ఆ దివ్యాంగుడు ఆమెను చంపేశాడు. ఇదంతా ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అయితే ఆ ఘటనను మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. మనుషుల్లో మానవత్వం మంటగలిసిందనడానికి ఇదొక్క ఘటనే చాలు. ఒంటరిగా ఉన్న వృద్దురాలిని చంపుతుంటే ఫోన్ తో వీడియో తీశారే గానీ, ఆమెను కాపాడటానికి ప్రయత్నించలేదు. మనిషిలో మానవత్వం అడుగంటిపోయిందని దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాసన్ గంజ్ జిల్లాలోని హోల్దేల్ పూర్ అనే గ్రామంలో జాంవతి అనే 62 ఏళ్ల వృద్దురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త మూడేళ్ల కిందట చనిపోవడంతో ఆమె ఒంటరిదైంది. ఆమె ఇంటికి ఎదురుగా మోను అనే దివ్యాంగుడు నివసిస్తున్నాడు. అతను జాంవతి ఇంటిపై కన్నేశాడు. ఆమెను చంపేస్తే ఆ ఇల్లు తన సొంతమవుతుందని మోను భావించాడు. గురువారం మధ్యాహ్నం జాంవతి ఇంటి ముందు కూర్చున్న సమయంలో అక్కడికి వెళ్లిన మోను ఆమెపై కాల్పులు జరిపాడు. దాంతో జాంవతి వెంటనే ఇంటిముందున్న అరుగుల మీది నుంచి కిందపడింది. మోను మరోసారి గన్ లోడ్ చేసి మరో రౌండ్ జాంవతిపై కాల్సులు జరిపాడు. దాంతో జాంవతి అక్కడికక్కడే మృతిచెందింది. గన్ సౌండ్ విని బయటకు వచ్చిన పొరుగింటి వ్యక్తి మోనును అడ్డుకునేదిపోయి.. ఏం చక్కా తన ఫోన్ తో వీడియో తీశాడు. కాసేపటికి అటొచ్చిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఘటన తర్వాత మోను అక్కడే ఉన్న మరో ఇంట్లో దాక్కొని ఉన్నాడు. అక్కడికొచ్చిన ఏఎస్పీ పవిత్ర మోహన్ జాంవతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జాంవతిని చంపిన మోనుతో పాటు.. ఆ ఘటనను మొత్తం వీడియో తీసిన పొరుగింటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.