థానే: పశ్చిమాసియాలో టెన్షన్ల కారణంగా మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆలస్యం అవుతుంది. ప్రజలపై ఈ ప్రభావం పడకుండా ఎల్పీజీ అందేలోపు వంటకు ఇబ్బంది లేకుండా కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్చి 12న సూచించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో కిరోసిన్ పంపిణీని మొదలుపెట్టారు. అంత్యోదయ అన్న యోజన (AAY), ప్రియారిటీ హౌస్హోల్డ్ రేషన్ కార్డ్ (PHH) ఉన్న లబ్దిదారులకు జిల్లా యంత్రాంగం రేషన్లో కిరోసిన్ పంపిణీ చేస్తుంది.
అంతేకాకుండా.. ఎల్పీజీ కనెక్షన్ లేని తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఈ రేషన్ కిరోసిన్ అందిస్తుంది. అర్హులైన లబ్దిదారులకు ఒక్కో కుటుంబానికి 3 లీటర్ల కిరోసిన్ రేషన్లో ఇస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో ఈ కిరోసిన్ పంపిణీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
►ALSO READ | మోదీ- ట్రంప్ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్..! పుకార్లను కొట్టిపారేసిన కేంద్రం
థానే జిల్లా కలెక్టర్ డాక్టర్.అశోక్ షింగారే ఈ పరిణామంపై స్పందించారు. కిరోసిన్ పంపిణీ చేస్తున్న విషయం వాస్తవమేనని.. నాలుగు ట్యాంకర్ల కిరోసిన్ ఇప్పటికే జిల్లాకు చేరుకుందని చెప్పారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటికే కిరోసిన్ సరఫరాను పెంచాయి. రాష్ట్రాలకు లక్ష లీటర్ల రెగ్యులర్ కోటాతోపాటు అదనంగా 48 వేల లీటర్లు సప్లై చేశాయి. హోటళ్లు, హాస్టళ్ల వంటి వ్యాపారాలు కిరోసిన్తో పాటు బయోమాస్, బొగ్గును నెలపాటు వాడటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ను శుద్ధి చేసినప్పుడు కిరోసిన్ ఉత్పత్తి అవుతుంది.
