నాదర్ గుల్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం..ప్రభుత్వ పెద్దల అండతో కాజేసే కుట్రలు: హరీశ్ రావు

నాదర్ గుల్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం..ప్రభుత్వ పెద్దల అండతో కాజేసే కుట్రలు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: నాదర్ గుల్​భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదని ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసమే హైడ్రాను తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న సీఎం.. నాదర్‌‌‌‌గుల్‌‌లోని వేల కోట్ల ప్రభుత్వ భూమి, అందులోని చెరువును రియల్టర్లు కబ్జా చేస్తుంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.

నాదర్‌‌‌‌గుల్ సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న వేల కోట్ల విలువైన 373 ఎకరాల భూములను రియల్​ఎస్టేట్​మాఫియా కబ్జా చేస్తున్నదని ఆరోపిస్తూ.. వందలాది మంది రైతులు హరీశ్​ రావును బుధవారం ఆయన నివాసంలో కలిశారు. పోలీసులు వేధిస్తున్నారని, రియల్​ఎస్టేట్​మాఫియా దాడులు చేయిస్తున్నదని వాపోయారు. ఈ సందర్భంగా హరీశ్​ రావు మాట్లాడుతూ.. నాదర్​గుల్​భూములు అన్యాక్రాంతం కాకుండా బీఆర్ఎస్ ​హయాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద హైకోర్టులో న్యాయ పోరాటం చేశామని చెప్పారు.  

భూములు సర్కారువేనని ప్రస్తుత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని పేర్కొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి, సీపీ సజ్జనార్, స్థానిక ఆర్డీవో, తహసీల్దార్లకు  ఫోన్​ చేసి మాట్లాడారు. ప్రభుత్వ  సీలింగ్ భూములకు  ప్రైవేట్ వాళ్లు కంచెలు వేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఆ కంచెలు తొలగించి, రైతులకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.  

రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు

సీఎం రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదని హరీశ్ రావు విమర్శించారు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నాశనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే, అనుచరులను సంతృప్తి పరచడంపైనే దృష్టి ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో, మొదటి దఫాలో నియమితులైన చైర్మన్లు ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా వారి పదవీకాలాన్ని ముగించారని గుర్తు చేశారు. 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు ఉద్దేశ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.