- తెలంగాణ నీటిని ఏపీకి వదిలేసి, ఇప్పుడు నీళ్లు లేవనడం సిగ్గుచేటని విమర్శ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయశాఖపై సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లపైనా చేతులెత్తేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’తో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పాత పద్ధతిలో కాకుండా కేంద్రం డిసైడ్ చేసిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడమంటే.. ధాన్యం కొనుగోళ్ల నుంచి స్టేట్ గవర్నమెంట్ తప్పుకోవడమేనని అన్నారు.
పంటలను కొనుగోలు చేయబోమనే తమ చేతగానితనాన్ని రాష్ట్ర కేబినెట్ మీడియా సాక్షిగా ఒప్పుకుందని విమర్శించారు. ప్రభుత్వం కొనకపోతే, పండిన పంటను రైతులు ఏం చేయాలి? ఇంట్లో దాచుకోవాలా? అని నిలదీశారు. పంట మార్పిడి చేయాలన్న ప్రభుత్వ మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై డిజిటల్ కేబినెట్ పేరుతో తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్‌నినోపై ముందస్తు చర్యలేవీ..
ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి వదిలేసి, ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి పంటలు చూసుకుని వేయాలని చెప్పడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌పై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ మీటింగ్‌కు ముందే తెలంగాణలో నీటి కొరత ఉందని, ఏపీ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లెటర్స్ రాసినా.. మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేసి, ఎల్ నినో పేరుతో తప్పించుకునే ప్లాన్ వేయడం సిగ్గుచేటని హరీశ్ రావు ధ్వజమెత్తారు
