- నోటీసుల వెనుక రాజకీయ ప్రతీకారం, రేవంత్ అహంకారం: హరీశ్ రావు
- ఇంటెలిజెన్స్ వ్యవస్థంతా ఎర్రవల్లి చుట్టే ఉన్నా నందినగర్‌లో గోడలకు నోటీసులా అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: సిట్ పేరుతో జరుగుతున్నది దర్యాప్తు కాదని.. ప్రతిపక్షనేతపై ప్రతీకార దాడి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. నోటీసుల వెనుక చట్టం లేదని, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి అహంకారమే ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ను సిట్విచారించిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ఉల్లంఘించి నోటీసులు ఇచ్చిందన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నిబంధనలేవీ పాటించలేదన్నారు.
కేసీఆర్ ఎక్కడుంటున్నారో రాష్ట్రానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవల్లి చుట్టే ఉన్నా నందినగర్‌లో గోడలకు నోటీసులు అంటించడం చౌకబారు రాజకీయానికి నిదర్శనమన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని నడింపించిన సీఎంకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు. చరిత్రను మలినం చేస్తున్నరు..
చరిత్రను సృష్టించింది కేసీఆర్ అయితే.. ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు మండిపడ్డారు. ఇది సిట్కాదని, ఇది సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్ (సీఐటీ) అని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారన్నారు. సిట్ స్వతంత్రంగా పనిచేయడం లేదని, సీఎం ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలతోనే పనిచేస్తున్నదని విమర్శించారు. సిట్ అంటే సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ వస్తున్న దారిపొడవునా పోలీసులను మోహరించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
