- కృష్ణా, గోదావరి జలాల్లో హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే
- నన్ను తిడుతున్నరు: హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: కర్నాటకలో ముగ్గురు సీఎంలతో జరిపిన మీటింగ్‌పై రేవంత్ రెడ్డి నోరు విప్పాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆ మీటింగ్ ఏం మాట్లాడారు..? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడారా..? అని తాను ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా తనను తిడుతూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలో బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఎత్తు గురించి మాట్లాడి సీఎం తప్పించుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
‘‘నేను పొడుగుంటే ఏంది, జగదీశ్ రెడ్డి పొట్టిగుంటేంది.. ప్రజలకు సేవ చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ పొడుగుగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి మనసు, ఆలోచన, నీ కురుచ బుద్ధి పొట్టిది.. కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. హామీల గురించి మాట్లాడటం చేతకాక బీఆర్ఎస్‌ను తిడుతున్నారు. గుంపు మేస్త్రీ ముంపు మేస్త్రీగా మారొద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను తిట్టకుండా ఉండలేకపోతున్నాడంటే మా పార్టీ బలం పుంజుకుంది. కుర్చీ కదులుతోందన్న భయం ఆయనలో పట్టుకుంది. మరో పదేండ్లు అధికారంలో ఉంటామంటున్న రేవంత్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి. మీ పాలన మీద నమ్మకం ఉంటే ఎన్నికలకు పోదాం” అని సవాల్ విసిరారు.
రైతుల కన్నీళ్లు కనిపిస్తలేవా?
వడ్లు అమ్ముడుపోక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, 80 లక్షల టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. సింగరేణి టెండర్లే కాలేదని రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చి, సీఎం బావమరిది సృజన్ రెడ్డికి టెండర్ కట్టబెట్టారని, అసెంబ్లీలో చర్చ పెడితే తాను రుజువు చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు.
