- కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఖజానా ఏటీఎంలా మారింది : హరీశ్ రావు
- ఇక్కడి ప్రజల గొంతు కోసి అక్కడ కలర్ పేజీ యాడ్స్ ఇస్తున్నది
- ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ సొమ్మునే వాడుకుంటున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత’అన్నట్టుగా తయారైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. పక్క రాష్ట్రం కేరళలో మాత్రం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారినట్టు అర్థమవుతోందన్నారు. కేరళ పత్రికల్లో యాడ్స్ ఇవ్వడంపై శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇక్కడ ప్రజల గొంతు కోసి, కేరళలో కలర్ పేజీ యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు.
ప్రజాధన దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదని, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్, హర్యానా.. ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుకుంటున్నదని మండిపడ్డారు. ఇక్కడ కమీషన్ల రూపంలో దండుకుంటున్న రూ.వేల కోట్లను ఇతర రాష్ట్రాల ఎన్నికలకు మళ్లిస్తున్నారనేది బహిరంగ రహస్యమని, అధిష్టానాన్ని మెప్పించడానికి తెలంగాణ ఖజానాను కాంగ్రెస్ పార్టీకి అక్షయ పాత్రగా మార్చారని ఆరోపించారు.
ప్రతీ కుటుంబాన్ని మోసం చేసింది..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ కుటుంబాన్ని మోసం చేసిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మహాలక్ష్మి కింద ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మహిళలను, తులం బంగారం పేరిట ఆడబిడ్డలను, స్కూటీల పేరిట విద్యార్థినులను, ఉద్యోగాలతో నిరుద్యోగ యువతను, రుణమాఫీ పేరిట రైతులను, ఆసరా పింఛన్ పేరిట వృద్ధులను మోసం చేసిందన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల కంట్లో మట్టికొట్టి.. కేరళ పత్రికల్లో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కితే అశోక్ నగర్ వీధుల్లో, ఉస్మానియా క్యాంపస్‌లో అర్ధరాత్రుల్లో విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారని మండిపడ్డారు. ఇక్కడ యువత భవిష్యత్తును అంధకారం చేసి.. తెలంగాణలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కేరళలో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ ప్రచారం తప్ప ఇంకోటి కాదని హరీశ్ అన్నారు.
