కేజ్రీవాల్ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు

కేజ్రీవాల్ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కాపీలను చించడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను అవమానించారని మాజీ కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్ కౌర్ బాదల్ మండిపడ్డారు. రైతుల సమస్యను దేశంలో తొలుతగా తానే గుర్తించినట్లు ప్రవర్తించారని కేజ్రీవాల్‌‌పై ఆమె ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్‌‌‌ను డ్రామాలు చేసే వ్యక్తిగా హర్ సిమ్రత్ పేర్కొన్నారు.

‘రైతుల సమస్యపై కేజ్రీవాల్ ఇన్ని రోజులుగా లేనిది ఒకేసారి హఠాత్తుగా స్పందించారు. అన్నదాతలపై ఆయనకు దయ కలిగి ఉండాలి. వాళ్లు గత కొన్ని రోజులుగా తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా రైతులు చనిపోయాక కేజ్రీవాల్‌‌కు ఈ నిరసనలు గుర్తుకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతుల వద్దకు వచ్చారు. ఇలాంటి డ్రామాలు పని చేయవని అర్థం చేసుకోవాలి. కేజ్రీవాల్, ఆయన పార్టీ (ఆప్) తమకు ఏ సాయం చేయలేదన్న విషయం రైతులకు తెలుసు. అలాగే కేంద్రం చెప్పినట్లు ఆయన వ్యవహరిస్తారని కూడా అన్నదాతలకు తెలుసు. రైతులను మోసం చేయాలని చూసే ఇలాంటి చర్యలను కేజ్రీ మానుకోవాలి’ అని హర్ సిమ్రత్ పేర్కొన్నారు.