జమ్మికుంటలో పర్యటించిన గవర్నర్​ బండారు దత్తాత్రేయ

జమ్మికుంటలో పర్యటించిన గవర్నర్​ బండారు దత్తాత్రేయ

హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ జమ్మికుంటకు చేరుకున్నారు. పట్టణంలోని ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్​రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, ఎమ్మెల్సీ వాణిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటులో జనార్దన్ రెడ్డి కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయనకు జనార్దన్​రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. జనార్దన్​ తన జీవితమంతా పేదలకు సేవ చేయడానికే అంకితం చేశారని చెప్పారు.

విస్తృతంగా భూసార పరీక్షలు..

దేశ వ్యాప్తంగా 12 కోట్ల రైతుల భూముల్లో భూసార పరీక్షలు పూర్తి చేసినట్లు దత్తాత్రేయ తెలిపారు. సాంకేతిక రంగంలో పెనుమార్పుల వల్ల వ్యవసాయంలో సైతం నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయన్నారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని సూచించారు.  సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. పరిపాటి జనార్దన్​రెడ్డి పుట్టిన గడ్డపై ఎమ్మెల్యే కావడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.