- తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ జిల్లాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అన్యాయం చేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ క్రికెటర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ విజయచందర్‌రెడ్డితో కలిసి గురువారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఏ కార్యకలాపాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు తగిన అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. ఎంపిక విధానం, క్లబ్ వ్యవస్థ, టోర్నమెంట్ నిర్వహణ, పరిపాలనా నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తిన క్రీడాకారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాల వారీగా సమాన అవకాశాలు కల్పించాలని, టీజీ–20 లీగ్ నిర్వహణ అనుమతులు, క్లబ్ సభ్యత్వాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
