V6 News

హెచ్‌సీయూ ప్రొఫెసర్ సస్పెండ్... స్టూడెంట్స్ ఆందోళన విరమణ

హెచ్‌సీయూ ప్రొఫెసర్ సస్పెండ్... స్టూడెంట్స్ ఆందోళన విరమణ

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. అనంతరం ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వకంగా చూపిస్తేనే.. ఆందోళన విరమిస్తామని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. రవిరంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు మరికొందరు ఉన్నారని..ఇప్పటికే వాళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్న విద్యార్థులు.. వారి సంగతేంటని ప్రశ్నించారు. దీంతో ప్రొఫెసర్ రవిరంజన్ ని సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తెలిపారు. బాధిత యువతికి యూనివర్సిటీ తరపున అండగా ఉంటామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించారు.

కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ కలిపి, అత్యాచారానికి ప్రయత్నించాడు

హెచ్‌సీయూకి చెందిన థాయిలాండ్ స్టూడెంట్ తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేసిందని గచ్చిబౌలి ఏసీపీ రఘునందన్ అన్నారు. స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని చెప్పారు. థాయిలాండ్ స్టూడెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశానని, నిన్న రాత్రి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ ను ప్రొఫెసర్ రవి రంజన్ కారులో తన ఇంటికి తీసుకెళ్లాడన్నారు. కూల్ డ్రింక్ లో ఆల్కహాల్ కలిపి ఇచ్చాడన్న ఏసీపీ... ఆపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. యువతి నిరాకరించడంతో ఆమెని కొట్టాడని, రవి రంజన్ ఆ స్టూడెంట్ ను కారులో తీసుకొచ్చి హాస్టల్ వద్ద దింపాడన్నారు. అమ్మాయి తన తోటి స్టూడెంట్స్ కి విషయం చెప్పిందన్న ఏసీపీ... స్టూడెంట్స్ తో కలిసి గచ్చిబౌలి పీఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేసిందని చెప్పారు. ప్రొఫెసర్ రవి రంజన్ ని అదుపులోకి తీసుకున్నామని, 353, 354-A కింద కేసు నమోదు చేశామని ఏసీపీ రఘునందన్ స్పష్టం చేశారు.