తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటుంది. మరికొన్ని గంటల్లో ప్రకటన విడుదల కాబోతున్నది. 2026, ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు.. కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. జెండా, ఎజెండా విడుదల చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కామ్రేడ్ పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్ధం అవుతున్న కవిత పార్టీ ప్రకటన ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. కవిత పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బహిరంగ సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మంది జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు జాగృతి శ్రేణులు.మేడ్చల్ సభలోనే కవిత పార్టీ పేరు జెండా, ఎజెండాను ప్రకటించనున్నారు.
కవిత పార్టీ పేరు ఇదే..!
కవిత పార్టీ పేరు “తెలంగాణ ప్రజా జాగృతి”, “తెలంగాణ ప్రజా వికాస సమితి” అంటూ జోరుగా ప్రాచారం సాగుతోంది.ఈమేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు కవిత. తెలంగాణ జాగృతి పేరుతోనే ఇప్పటికే చేరికలు ప్రారంభమయ్యాయి. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, పలువురు కార్యకర్తలు కవిత సమక్షంలో పార్టీలో చేరారు.
“జనం బాట” కార్యక్రమంతో పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు కవిత. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ నీ ,మరోవైపు బిజెపిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు కవిత. కవిత పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకనున్నారు.

