నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తుండగా ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన హృతిక్ మిశ్రా(21)..నీట్ రద్దు కావడంతో తన కళ్లముందే డాక్టర్ కల చెదిరిపోతుందన్న ఆవేదనతో తనువు చాలించాడు.
విద్యార్థి హృతిక్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార్థి కావాలనే లక్ష్యంతో హృతిక్ గత మూడేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. ఈ ఏడాది ఎగ్జామ్ లో అత్యద్భుతంగా రాణించిన హృతిక్, ఎలాగైనా సీటు వస్తుందన్న ధీమాతో ఉన్నాడు. కానీ, పేపర్ లీక్ ఆరోపణలు, ఆపై ఎగ్జామ్ రద్దు వార్తలు అతన్ని కుంగదీశాయి. తిరిగి ఎగ్జామ్ రాయాల్సి వస్తే తన కష్టమంతా వృధా అవుతుందేమోనన్న ఆందోళనతో మే 14న ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కష్టపడి సాధించిన ఫలితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ రాసే పరిస్థితి రావడం హృతిక్‌ను తీవ్ర కలతకు గురిచేసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
►ALSO READ | తలలో కత్తి దిగినా ఫోన్ మాట్లాడుతూ... వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే
నీట్-యూజీ ఎగ్జామ్ అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు గోవాలో కూడా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఎగ్జామ్ షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో లక్షలాది మంది భవిష్యత్తు అంధకారంలో పడింది.
